అర్హత సాధించలేకపోయిన ఆంధ్రప్రదేశ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకున్న 7 రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బిఎంకు అదనంగా రూ. 16,691 కోట్లు రుణం పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి రూ.5392 కోట్ల అదనపు రుణం పొందేందుకు అనుమతి లభించింది. అదనపు రుణం పొందేందుకు అర్హత పొందిన రాష్ట్రాల్లో మన రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్‌లు ఉన్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు మిగతా రాష్ట్రాలన్నీ మూలధన వ్యయ లక్ష్య సాధనలో వెనకబడ్డాయని కేంద్రం తెలిపింది. ఆస్తుల సృష్టిలో వెనుకబాటు కారణంగా ఎపి అర్హత సాధించలేకపోయిందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దీంతో అసలే అప్పులు పుట్టకపోతే బండి నడవని పరిస్థితిలోకి వెళ్లిపోయిన ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు మరితం గడ్డు పరిస్థితి వచ్చింది.
ఇప్పటి వరకూ కేంద్రం ఇచ్చిన రుణ పరిమితికి తగ్గట్లుగా లోన్లు తీసుకున్నారు. ఇంకా అదనపు అనుమతి కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసి అదే పనిగా కేంద్రమంత్రులతో సమావేశం అయినా అనుమతి రాలేదు. కాగా మన రాష్ట్రానికి మాత్రం ఐదువేల కోట్లకు పైగా అదనపు అప్పులకు పర్మిషన్ ఇచ్చింది. కేంద్రం అదనపు అప్పులకు పర్మిషన్ ఇవ్వాలంటే రాష్ట్రం స్పష్టమైన నిబంధనలు పాటించింది. తీసుకున్న రుణంలో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా ఉండాలి. అంటే అప్పుల్ని సంపద సృష్టించడానికి వాడుకోవాలి. కానీ ఎపి ప్రభుత్వం తీసుకున్న రుణాలను నగదు బదిలీకి వాడేసింది. అందుకే ఎక్కడా సంపద సృష్టి జరగడం లేదు. ఇలా సంపదను సృష్టించి ఉంటే అదనపు రుణాలకు అవకాశం ఇచ్చి ఉండేవారు. అలా లేకపోవడంతో పర్మిషన్ దక్కలేదు. క్యాపిటల్ వ్యయం ఎక్కువ చేసిన రాష్ట్రాలకు అప్పులకు అనుమతి లభించింది.