నిబంధనలు సడలించిన కేంద్రం
న్యూఢిల్లీ: విదేశీ ప్రముఖుల నుంచి బహుమతులు పొందేందుకు ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, బహుమతులపై 50 ఏళ్లుగా కొనసాగుతున్న ఆంక్షలు తొలగిపోనున్నాయి. ఆల్ ఇండియా సర్వీస్‌ల్లో పని చేసే అధికారులు ప్రభుత్వ పనుల కోసం తమ దగ్గరికి వచ్చేవారి నుంచి ఎలాంటి బహుమతులు స్వీకరించకుండా 1968 నుంచి నిబంధనలు అమలు చేస్తోంది. తమ సమీప బంధువులు, స్నేహితుల నుంచి మాత్రమే ఆయా ఫంక్షన్ల సందర్భంగా స్వీకరించేందుకు మాత్రమే వీలు కల్పించింది. ఆ సందర్భాల్లో కూడా రూ.25000కన్నా అధిక మొత్తముండే బహుమతుల విషయంలో ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. విదేశీయుల నుంచి అధికారులకు వచ్చే బహుమతులను ఇప్పటివరకు విదేశాంగశాఖ ఆధ్వర్యంలోని తోశాఖానాకు పంపడం ఆనవాయితీగా వచ్చింది. 1968 నిబంధనలకు ఇప్పుడు ఓ సవరణ చేసింది. సెక్షన్ 11లో సబ్‌రూల్ చేర్చింది. దీంతో, విదేశీయుల నుంచి అధికారులు బహుమతులు పొందే వీలు కల్పించింది.