ఆసుపత్రులకు కేంద్రం అనుమతి
న్యూఢిల్లీ : మౌలిక సాధనాసంపత్తి, తగు ఏర్పాట్లతో ఆసుపత్రులలో సూర్యాస్తమయం తరువాత కూడా అంటే రాత్రిపూట కూడా పోస్టుమార్టం నిర్వహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం అనుమతిని ఇచ్చింది. అయితే ఆత్మహత్య, అత్యాచారం, హత్య, కుళ్లిన శవాలు, అనుమానాస్పద స్థితి మరణాల వంటి కేసులలో ఈ రాత్రిపూట శవపరీక్ష అనుమతి వర్తించదు. కేంద్రం వెలువరించిన ఈ పోస్టుమార్టం అనుమతికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవీయ హిందీలో ట్వీటుతో వివరణ ఇచ్చారు. కేవలం పగటిపూటనే పోస్టుమార్టం నిర్వహించాలనే నిబంధన బ్రిటిష్ వారి హయాంలో విధించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొనే సుపరిపాలన దిశలో తీసుకుంటున్న పలు చర్యలలో ఇది కూడా ఒకటి అని పేర్కొన్నారు.
ఇంతకు ముందులాగా ఆసుపత్రులలో పోస్టుమార్టం జరిపించేందుకు పగటి పూట నిబంధన ఎత్తివేస్తున్నామని, సరైన సౌకర్యాలు ఉంటే 24 గంటలలో ఎప్పుడైనా పోస్టుమార్టం నిర్వహణకు ఇప్పుడు వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ వేగవంతంతో ఆమోదిత విధానంలో మృతుల అవయవ దానాలు, అవయవ మార్పిడికి నిర్ణీత సమయంలోనే వీలేర్పడుతుందని తెలిపారు. మెడికో లీగల్ కేసులలో ఇప్పటివరకూ ఉన్న నిబంధనలతో పోస్టుమార్టం నిర్వహణకు రోజుల తరబడి సమయం పడుతోంది. దీనితో పలు తదనంతర పరిణామాలు తలెత్తుతున్నాయి. దీనిపై న్యాయ, ఆరోగ్య సామాజిక సంస్థల నుంచి వెలువడ్డ సూచనలు, ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు తుది నిర్ణయం తీసుకున్నారని ఆరోగ్య మంత్రి తెలిపారు. అయితే రాత్రిపూట నిర్వహించే పోస్టుమార్టంలను తప్పనిసరిగా వీడియో చిత్రీకరణతో రికార్డుగా భద్రపర్చాల్సి ఉంటుంది.