ప్రజలకు ఇంత వరకు సులభంగా అందుబాటులో ఉంటున్న కొన్ని రకాల ఎన్నికల పత్రాల లభ్యతపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఎన్నికల ప్రవర్తన నిబంధనావళి (సిఇఆర్)ని సవరించింది. ‘ఎన్నికలకు సంబంధించిన అన్ని ఇతర పత్రాలు ప్రజల పరిశీలనకు అర్హం’ అని 1961 ఎన్నికల ప్రవర్తన నిబంధనావళిలోని 93(2)(ఎ)నిబంధన ఇంతకు ముందు తెలియజేసింది. శుక్రవారం జరిగిన సవరణ దృష్టా ఆ నిబంధన ఇక ‘ఎన్నికలకు సంబంధించిన ఈ నిబంధనల్లో నిర్దేశించిన ప్రకారం అన్ని ఇతర పత్రాలు ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంటాయి’ అని సూచిస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికల సమయంలో సృష్టించిన, నిబంధనావళిలో నిర్దేశించని అధికార పత్రాల శ్రేణికి అందుబాటును ‘ఈ నిబంధనలలో నిర్దేశించిన ప్రకారం’ అన్న పదాల చేర్పు పరిమితం చేస్తోందని హక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు.
నిబంధనావళిలో ప్రస్తావించని, కానీ ప్రిసైడింగ్ అధికారులు, ప్రభావశీల నియోజకవర్గాల జాబితా రూపొందించే, ఇవిఎంల రవాణాకు, పోలింగ్ రోజు లోపభూయిష్టంగా మారిన వాటి మార్పునకు బాధ్యులైన సెక్టార్ అధికారులు, పోలీస్, వ్యయ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారులు వంటి ఎన్నికల అధికారులు సృష్టించిన పత్రాల శ్రేణి ఉందని ఆర్‌టిఐ కార్యకర్త వెంకటేశ్ నాయక్ తెలిపారు. ఎన్నికల నిష్పాక్షికతను, ఫలితాల సవ్యతను నిర్ధారించేందుకు ఆ పత్రాలు అందుబాటులో ఉండడం కీలకం’ అని నాయక్ మీడియాతో చెప్పారు. ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో పోలైన వోట్లు సంబంధించిన పత్రాల కాపీలను, వీడియో ఫుటేజిని న్యాయవాది మెహమూద్ ప్రాచాకు అందజేయాలని ఎన్నికల కమిషన్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశించిన రెండు వారాల్లోపే ఆ నిబంధనావళిలో సవరణ చోటు చేసుకున్నది.
కొత్త సవరణ ఆ సమాచారాన్ని నిలిపివేస్తుందని ప్రాచా అన్నారు. ‘ఎన్నికల కమిషన్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఇది ధ్రువీకరిస్తోంది’ అని ప్రాచా అన్నారు. కాగా, ‘ఎన్నికల బాండ్ల కేసులో సుప్రీం కోర్టు నిర్దేశించిన పూర్తి పారదర్శకత సూత్రాన్ని ఆ సవరణ ఉల్లంఘిస్తోంది. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడిన రోజే ఆ సవరణ నోటిఫికేషన్ రావడం వల్ల ప్రస్తుత సమయంలో దాని ఆవశ్యకతను ప్రశ్నించే అవకాశం ఎంపిలకు లేకపోయింది’ అని నాయక్ వ్యాఖ్యానించారు.