త్రీస్టార్ అధికారులు, రిటైర్డ్ అధికారులూ అర్హులే
న్యూఢిల్లీ: దేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్) నియామకం చేపట్టే ముందు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులుచేసింది. సిడిఎస్ నియామకం అర్హత పరిధిని మరింత పెంచుతూ సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేసింది.ఈ మేరకు రక్షణ శాఖ శుక్రవారం ఒకనోటిఫికేషన్ జారీ చేసింది.తాజా సవరణతో త్రీస్టార్ అధికారులు, రిటైర్డ్ అధికారులు ఈ పదవికి అర్హులు కానున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం లెఫ్టెనెంట్ జనరల్ సమానులు, జనరల్ సమానులు, లేదా లెఫ్టెనెంట్ జనరల్/ జనరల్ ర్యాంక్‌తో రిటైరయినఅధికారుల(వయసు 62 ఏళ్లకు మించరాదు)ను కూడా సిడిఎస్ పదవికి ఎంపిక చేసేందుకు అవకాశం అభించినట్లయింది. అటు ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మార్షల్, ఎయిర్ చీఫ్ మార్షల్ లేదా ఇదే ర్యాంకుతో రిటైరయిన అధికారులను కూడా సిడిఎస్‌గా నియమించవచ్చు. నౌకాదళానికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. అంటే త్రివిధ దళాల్లో రెండో అత్యధిక ర్యాంకు అధికారులు కూడా తమ చీఫ్‌లను దాటుకుని సిడిఎస్ పదవిని చేపట్టే అవకాశం ఉంటుంది. తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమితులైన బిపిన్ రావత్ గత ఏడాది జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన సతీమణి కూడా ప్రాణాలు కోల్పోయారు. రావత్ మరణంతో సిడిఎస్ పదవి ఖాళీ అయింది, అప్పటినుంచితదుపరి సిడిఎస్‌ను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూనే ఉంది.