Thursday, November 21, 2024

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా

- Advertisement -
- Advertisement -

ఈ బడ్జెట్‌లో కూడా తెలంగాణకు మళ్లీ భంగపాటే
ఎపికి రూ.15 వేల కోట్ల నిధులు….
తెలంగాణలోని ప్రాజెక్టుల జాతీయ హోదాను పట్టించుకోని కేంద్రం
హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్‌కు
అత్తెసరు తోడ్పాటునందించిన కేంద్ర ప్రభుత్వం
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలపై బడ్జెట్‌లో ప్రస్తావించని కేంద్రం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుత 2024,-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించగా, తెలంగాణకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఓ పక్క ఎపికి రూ.15 వేల కోట్ల నిధులతో పాటు రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించిన కేంద్రం, కానీ, తెలంగాణకు మాత్రం హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి అత్తెసరు నిధులు మినహా మరెక్కడా తెలంగాణకు నిధుల ప్రస్తావన తీసుకురాలేదు.

అయితే, హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించి తెలంగాణ పరిధి 150 కిలో మీటర్లు మాత్రమేనని దీనివల్ల పెద్దగా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు తెలంగాణలోని ప్రాజెక్టులను జాతీయ హోదా ఇవ్వాలని 10 ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా ఆ దిశగా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా ప్రతి బడ్జెట్‌లోనూ తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపుతుండడం, ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మళ్లీ భంగపాటే ఎదురుకావడంతో సిఎం రేవంత్, మంత్రులు, దీనిపై అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి బిజెపికి చెందిన ఎంపిలను ఎనిమిది మంది గెలిపించినా రాష్ట్రానికి నరేంద్ర మోడీ నిధులు కేటాయించకపోవడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

జేడీయూ, టిడిపి పాలిత రాష్ట్రాలైన బీహార్, ఎపిలకే ప్రాధాన్యం
కేంద్ర బడ్జెట్‌లో ఎపి రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించినా ఆ యాక్ట్ పరిధిలోకి వచ్చే తెలంగాణ పేరు మాత్రం ప్రస్తావించలేదు. బిజెపి మిత్రపక్ష పార్టీలైనా జేడీయూ, టిడిపి పాలిత రాష్ట్రాలైన బీహార్, ఎపిలకే ప్రధాని మోడీ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎపి రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందజేయనుండగా రాబోయే సంవత్సరాల్లో మరింత ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతోపాటు పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి తమవంతు కృషి చేస్తామని కేంద్రం హామి ఇవ్వడం విశేషం.

రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఎపిలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటునందించడంతో పాటు విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్‌కు తోడ్పాటు, కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ కారిడార్‌కు అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆర్థిక ప్రగతికి దోహదం చేసే పారిశ్రామిక కారిడార్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో అదనపు నిధులు కేటాయిస్తామని కేంద్రం సూచించింది.

తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఇదే కోటాలో
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించిన ఏకైక అంశం హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్‌కు అత్తెసరు తోడ్పాటునందిస్తామని కేంద్రం వెల్లడించడం విశేషం. వెనుకడిన ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర కోస్టల్ ఏరియాకు బ్యాక్ రీజియన్ గ్రాంట్స్ అందించి ఆదుకుంటామని కేంద్రం హామీ ఇవ్వడం గమనార్హం. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఇదే కోటాలో నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం మాత్రం కనీసం పట్టించుకోలేదు. తెలంగాణలోని ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఏఐబిపి స్కీంలోకి తీసుకోకపోవడం విశేషం.

తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టును ప్రకటించలేకపోవడం విశేషం. సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్, వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు ఆర్థిక సాయం, తెలంగాణలోని ఇండస్ట్రీయల్ కారిడార్లకు నిధులు ఇవ్వడంలో కేంద్రం మొండిచేయి చూపింది. ఎపి రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లో హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావనే లేకపోగా, ములుగు ట్రైబల్ యూనివర్సిటీకి అదనపు నిధుల అంశంతో పాటు తెలంగాణకు జాతీయ విద్యా సంస్థల కేటాయింపులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రాష్ట్ర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News