మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే కేంద్రం మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో పేద కుటుంబంలో ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వ పరంగా కొంత మేరకైనా ఆర్ధికంగా అదుకోవాలన్న లక్షంతో ముఖ్యమంత్రి కెసిఆర్ కళ్యాణ లక్ష్మీ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పథకం కింద వివాహం జరిగే నాటికి అర్హులైన కుటుంబానికి రూ.1,16,000ల చొప్పున అందజేస్తోంది. ఈ పథకానికి దేశ వ్యాప్తంగా పేరు రావడంతో కేంద్రం కూడా తెలంగాణను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టన బడ్జెట్‌లో కొత్తగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ లక్ష్మీ పథకాన్ని తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి త్వరలో తగు మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
రానున్న ఐదేళ్ల (2021….2026) కాలానికి 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు తెలంగాణకు రూ. 1,09,786 కోట్లు రానున్నాయి. ఈ మేరకు 15వ ఆర్ధిక సంఘం కేంద్రానికి సిఫారసులు చేసింది. ఇందులో కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 88,806 కోట్లు, స్థానిక సంస్థలకు కేటాయింపులు రూ. 13,111 కోట్ల మేరకు రానున్నాయి. అలాగే ఆరోగ్య రంగానికి రూ. 624 కోట్లు, పిఎంజిఎస్‌వై ( రోడ్ల) కింద రూ.255 కోట్లు, గణాంకాలకు రూ. 46 కోట్లు, న్యాయవ్యవస్థ కోసం రూ. 245 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 189 కోట్లు, వ్యవసాయానికి రూ.1665 కోట్లు, రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ. 2362 కోట్లు, విపత్తు నిర్వహణకు రూ. 2483 కోట్ల మేరకు కేంద్రం కేటాంపులు చేసినట్లు కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ సోమవారం వెల్లడించిన వార్షిక బడ్జెట్‌లో పేర్కొన్నారు.
అత్యల్ప అప్పులో రాష్ట్రానికి నాలుగవ స్థానం
కాగా 15వ ఆర్థిక కమిషన్ నివేదిక ప్రకారం ఫైనాన్స్ కమిషన్ కాలం ముగిసేనాటికి 32.5శాతంగా జిఎస్‌డిపి ఉన్న తెలంగాణ అప్పు 29శాతంగా ఉంటుందని పేర్కొన్నది. ఇది భారతదేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే అతి తక్కువ అప్పుల్లో తెలంగాణ రాష్ట్రంలో 4వ స్థానంలో ఉంటుందని సూచించింది. కాగా జిఎస్‌డిపి నిష్పత్తికి కొంచెం తక్కువ రుణం తీసుకునే రాష్ట్రాల జాబితాలో కర్ణాటక 27.1శాతం, మహారాష్ట్ర 28.5 శాతం, తమిళనాడు 28.7 శాతంగా ఉంటుందని పేర్కొన్నది.
Centre announces Garib Kalyan Laxmi Scheme in Budget