Thursday, December 26, 2024

కేంద్ర బడ్జెట్ పై ఏపీ మస్త్ హ్యాపీ..

- Advertisement -
- Advertisement -

అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ
పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటు అందించే విద్యుత్, రైల్వే నీటి ప్రాజెక్టులకు నిధులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారం
విశాఖ చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి ప్రాధాన్యం
ఏపీకి గణనీయంగా కేటాయింపులు
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఇది ప్రగతి శీల బడ్జెట్ : చంద్రబాబు

మన తెలంగాణ / అమరావతి: ఏపీపై కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం కరుణ చూపింది. రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు కేటాయించింది. అమరావతితో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఆయా ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో పాటు ఏపీ ఆర్బన్ డెవలప్‌మెంట్ కోసం 1500 కోట్లు ప్రకటించారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తికి కట్టుబడి ఉన్నామంటూ నిధులు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.

అలాగే విశాఖ, చెన్నై కారిడార్, ఓర్వకల్లు నుంచి బెంగుళూరు కారిడార్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అందుకు తగ్గట్లు నిధులు విడుదల చేస్తామని లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించేలా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పారు.

ఆ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ:

ఈ సందర్భంగా విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం. భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకమైనది. పోలవరం నిర్మాణం సత్వరం జరిగేలా చూస్తామని నిర్మలమ్మ భరోసానిచ్చారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు.

రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ – చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని తెలిపారు.

ఇది ప్రగతి శీల బడ్జెట్ : చంద్రబాబు

కేంద్ర బడ్జెట్‌పై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఏపీ అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ పునర్నిర్మాణం దిశగా కేంద్రం అందిస్తున్న ఈ సహకారం ఎంతో ఉపకరిస్తుంవదని చంద్రబాబు వివరించారు. ఎంతో భరోసా అందించేలా ఉన్న ఇలాంటి ప్రగతి శీల బడ్జెట్‌ను సమర్పించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు.

కేంద్రం మాట నిలబెట్టుకుంది: మంత్రి నాదెండ్ల మనోహర్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడాన్ని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15వేల కోట్లు కేటాయించడం, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్రం ప్రకటించడంపై జనసేన పార్టీ శాసనసభ పక్షం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఏదైతే ఆశించి 2020లో బిజెపితో పొత్తు పెట్టుకున్నారో ఆ దిశగా అడుగులు పడటం శుభసూచకమన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు అనంతరం మీడియా పాయింట్ లో విలేకర్లతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్ గారు, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్ , సుందరపు విజయ్ కుమార్, బొమ్మిడి నాయకర్, గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది: పురంధేశ్వరి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం సాయం అందిస్తోందని, రాయలసీమలోని నాలుగు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున ఇస్తున్నారని, ఈ ఏడింటితోపాటు వెనుకబడిన ప్రకాశం జిల్లాను కూడా కలిపారన్నారు. మొత్తం 8 జిల్లాలకు సహకారం అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సహకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారని, రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.269 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

ఇవి బడ్జెట్ పద్దులా..మేనిఫెస్టో హామీలా: షర్మిల
ఇవి బడ్జెట్ పద్దులా..ఎన్నికల మేనిఫెస్టో హామీలా అని కేంద్ర బడ్జెట్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. మరోసారి ప్రత్యేక హోదా ఊసు లేకుండా, విభజన చట్టంలోని అనేక అంశాను బూజు పట్టించారని విమర్శించారు. అటు రాష్ట్ర ప్రజల ఆశలను, ఇటు కూటమి పొత్తు ధర్మాన్ని రెండింటినీ నిలువుగా దగా చేశారని షర్మిల మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చిన హామీలే మోసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News