న్యూఢిల్లీ: చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్3 సురక్షితంగా దిగడాన్ని కొనియాడుతూ కేంద్రమంత్రివర్గం మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మిషన్ ఒక్క ఇస్రోకే కాక ప్రపంచవేదికపై భారత దేశ పురోగతికి,ఎదుగుదలకు నిదర్శనమని ఆ తీర్మానం పేర్కొంది.చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చంద్రయాన్3 ముద్దాడిన ఆగస్టు 23న నేషనల్ స్పేస్ దినోత్సవంగా జరుపుకోవాలన్న ప్రతిపాదనను కూడా మంత్రివర్గం స్వాగతించింది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌కు మీడియాకు ఈ విషయం తెలియజేస్తూ చంద్రయాన్3 విజయంలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం( ఇస్రో) కృషిని అభినందించిన మంత్రివర్గం శాస్త్రజ్ఞులకు కృతజ్ఞతలు తెలియజేసిందన్నారు. విజ్ఞానాన్ని శోధించడానికి భారత శాస్త్రవేత్తలు ఎలాంటి అడ్డంకులనైనా అధిగమిస్తారనే దానికి ఇదొక నిదర్శనమని ఆ తీర్మానం పేర్కొంది. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంతో దిగిన తొలి దేశం భారతేనన్న విషయాన్ని కూడా మంత్రివర్గం గుర్తు చేసింది.
చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో దిగడం, కఠినతరమైన పరిస్థితులను అధిగమించడం మన శాస్త్రవేత్తల స్ఫూర్తికి నిదర్శనం. రోదసి రంగంలో భారత్ పురోగతి కేవలం శాస్త్రీయ విజయాలే కాదని, ప్రగతి విజన్‌కు, స్వయంసమృద్ధికి, ప్రపంచ నాయకత్వానికి అవి ప్రాతినిధ్యం వహిస్తాయని మంత్రివర్గ తీర్మానం పేర్కొంది. ఈ చరిత్రాత్మక మిషన్‌లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరినీ మంత్రివర్గం అభినందిస్తోంది. భావావేశం, పట్టుదల, తిరుగులేని అంకితభావంతో భారత దేశం సాధించగల విజయాలకు చంద్రయాన్3ఒక నిదర్శనమని ఆ తీర్మానం పేర్కొంది.చంద్రయాన్ 3 విజయంలో భారత దేశపు అంతరిక్ష పరిశోధనా కార్యక్మంలో పెద్ద సంఖ్యలో మహిళా శాస్త్రవేత్తలు పాలు పంచుకోవడం పట్ల మంత్రివర్గం గర్విస్తోందని, రాబోయే సంవత్సరాల్లో శాస్త్రవేత్తలు కావాలనుకునే అనేక మంది మహిళలకు ఇది స్ఫూర్తిదాయకమవుతుందని కూడా ఆ తీర్మానం పేర్కొంది.