Friday, December 20, 2024

వలస పాలన గుర్తులను చెరిపేస్తున్న మోడీ సర్కార్

- Advertisement -
- Advertisement -

వలస పాలన గుర్తులను చెరిపేస్తున్న మోడీ సర్కార్
గత 8 ఏళ్లలో తీసుకున్న చర్యలను వివరించిన ప్రభుత్వం
అందులో భాగమే రాజ్‌పథ్ పేరు మార్పని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న చరిత్రాత్మక రాజ్‌పథ్‌కు ‘కర్తవ్య పథ్’గా నూతన నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్‌గా మార్చడాన్ని స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భంగా దేశాన్ని వలసవాద భావనలనుంచి విముక్తి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపులో భాగమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో బ్రిటీష్ వలస పాలన నాటి చిహ్నాలను తుడిచి వేయాలన్నది తన ఉద్దేశమని ప్రకటించిన విషయం తెలిసిందే. మోడీ అధికారంలోకి వచ్చిన గత ఎనిమిదేళ్ల కాలంలో ఈ దిశగా కేంద్రం అనేక చర్యలు తీసుకుంది.ప్రధాని చేస్తున్న నిరంతర కషిలో భాగమే రాజ్‌పథ్ పేరును ‘కర్తవ్య పథ్’గా మార్చడమని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా ప్రధాని తీసుకున్న ఐదు ప్రతినల్లో భాగంగా చేపట్టిన పలు చర్యలను కూడాఆ నోట్‌లో వివరించింది.
రాజ్‌పథ్‌ నుంచి కర్తవ్యపథ్‌కు..
గత వలసపాలనకు సంబంధించిన గుర్తులన్నిటినీ చెరిపివేయాలన్న ఉద్దేశంలో భాగంగా రాజ్‌పథ్‌ను, కొత్త పార్లమెటు భవనం సెంట్రల్ విస్టా లాన్‌లను కలిపి ‘కర్తవ్యపథ్’గా మార్చాలని ప్రధాని నిర్ణయించారు. ఐదవ కింగ్ జార్జి గౌరవార్థం బ్రిటీష్ పాలన సమయంలో ఈ మార్గాన్ని‘కింగ్స్‌వే’ గా పిలిచే వారు. స్వాతంత్య్రం అనంతరం దీన్ని ‘రాజ్‌పథ్’గా పేరు మార్చారు.
నౌకాదళానికి కొత్త చిహ్నం
ఈ నెల 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ భారత నౌకాదళానికి కొత్త చిహ్నాన్ని( నిషాన్)ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. సెయింట్ జార్జి క్రాస్ గుర్తుతో ఉండిన బ్రిటీష్ కాలం నాటి నేవీ జెండాలను తొలగించి ఛత్రపతి శివాజీ మహరాజ్ రాజముద్రికతో కూడిన కొత్త నిషాన్‌ను ఆవిష్కరించారు. దీనిద్వారా బానిసత్వపు, వలసపాలన నాటి గుర్తులను చెరివేసినట్లయిందని ఈ సందర్భంగా ప్రధాని చెప్పడం తెలిసిందే.
లోక్ కళ్యాణ్‌మార్గ్‌గా రేస్‌కోర్స్ రోడ్డు
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ బ్రిటీష్ కాలం నాటి గుర్తులను చెరివేయాలన్న తన ఉద్దేశాన్ని ప్రకటించినప్పటికీ 2016లో రేస్‌కోర్సు రోడ్డు పేరును లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చడంతోనే ఆ ప్రక్రియ ప్రారంభమయింది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉంది.
కాలం చెల్లిన చట్టాల రద్దు
2014 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం 1500కు పైగా కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసింది. వీటిలో చాలా భాగం బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో చేసిన చట్టాలే కావడం గమనార్హం.
కేంద్ర బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ విలీనం
92 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి స్వస్తి చెబుతూ ప్రభుత్వం 2017లో రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేసింది. అలాగే ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బ్రిటీష్ ప్రభుత్వం నాటి సంప్రదాయానికి కూడా ప్రభుత్వం స్వస్తి చెప్పింది. ఇప్పుడు బడ్జెట్‌ను ఫిబ్రవరి నెల మొదటి రోజున ప్రవేశపెడుతున్నారు.
ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం ఏర్పాటు
గత జనవరిలో ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహానికిచెందిన హోలోగ్రామ్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. గతంలో ఐదవ కింగ్ జార్జి విగ్రహం ఉండిన ఈ ఛత్రం వద్ద నేతాజీ విగ్రహాన్నిగురువారం ప్రధాని మోడీ ఆవిష్కరించారు.
బీటింగ్ రిట్రీట్‌లో మార్పులు
ఈ ఏడాది రిపబ్లిక్ డే నుంచి బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ముగింపు లో భాగంగా వినిపించే ‘ అబైడ్ విత్ మి’ గీతం స్థానంలో కవి ప్రదీప్ రాసిన దేశభక్తి గీతం ‘ఆయే మేరే వతన్‌కే లోగోం’ను చేర్చారు. ఇంతకు ముందు 2015లో బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో వాయించే సంగీత పరికరాల్లో సితార్, సంతూర్, తబలా లాంటి భారతీయ సంగీత పరికరాలను చేర్చడం ద్వారా కీలక మార్పులు చేశారు.
నేషనల్ వార్ మెమోరియల్‌లో అమర జవాన్ జ్యోతి విలీనం
ఎప్పుడూ వెలుగుతూ ఉండే అమరజవాన్ జ్యోతిని నేషనల్ వార్ మెమోరియల్ జ్యోతిలో విలీనం చేశారు.
అండమాన్ నికోబార్ దీవుల పేరు మార్పు
అండమాన్ నికోబార్ దీవుల పేరును షహీద్, స్వరాజ్ దీవులుగా మార్చాలని 1943లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సూచించారు. నేతాజీకి నివాళిగా 2018లో ప్రధాని మోడీ రాస్ ఐలాండ్ పేరును నేతాజి సుభాష్ చంద్రబోస్ ద్వీప్‌గా, నీల్ ఐలాండ్‌ను షహీద్ ద్వీప్‌గా, దీవి పేరును స్వరాజ్ ద్వీప్‌గా మారుస్తున్నటు ప్రకటించారు.
బిప్లోబి భారత్ గ్యాలరీ ఆవిష్కరణ
స్వాతంత్య్ర పోరాటంలోని విప్లవ ఘట్టాలను గుర్తు చేసే బిప్లోబి భారత్ గ్యాలరీని కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్ వద్ద ప్రధాని మోడీ ఇటీవల ప్రారంభించారు. అలాగే బ్రిటీష్ కాలం నాటి ఆంగ్ల ఆధారిత బోధనకు స్వస్తి పలుకుతూ జాతీయ విద్యావిధానం2020లో మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యత కల్పించారు. ఇవే కాకుండా ఐరంగజేబ్ రోడ్డును ఎపిజె అబ్దుల్ కలాం మార్గ్‌గా, డల్హౌసీ రోడ్డును దారా షికో రోడ్డుగా, తీన్‌మూర్తి చౌక్‌ను తీన్‌మూర్తి హైఫా చౌక్‌గా మార్చడం జరిగింది.

Centre announces re name Rajpath as Kartavya Path

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News