Friday, November 22, 2024

రాష్ట్రానికి ‘జోన్’ జోష్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఏడు కొత్త జోన్లు
33 జిల్లాల పరిధిలో జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం
కొత్త జోన్లతో విస్తృత ప్రయోజనాలు
అన్ని జిల్లాల వారికి సమాన అవకాశాలు

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకూ ఈ జోన్ల విధానం వర్తిసుందని గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అన్ని జిల్లాలకు సమానావకాశాలు
కొత్త జోనల్ విధానాన్ని రాష్ట్రపతి ఆమోదించడంతో తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం కావడంతో పాటు విద్యార్థులకు, ఉద్యోగులకు అనేక రకాల ప్రయోజనాలు సమకూరనున్నాయి. ప్రధానంగా విద్యా ఉద్యోగావకాశాల్లో అసమానతలను తొలగిపోయి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానావకాశాలు దక్కనున్నాయి. అలాగే స్థానిక రిజర్వేషన్లు కూడా పక్కాగా అమలుకానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జోన్ల విధానం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందనే భావనతో ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జోనల్ విధానం రూపకల్పనపై దృష్టి సారించారు. నగరాలు, పట్టణాలు, ఇతర రకాలుగా పురోగమించిన జిల్లాలకే కాకుండా మారుమూల, ఏజెన్సీ, ఇతరత్రా వెనకబడిన జిల్లాలకు అన్ని విధాలా న్యాయం జరగాలనే సంకల్పంతో కొత్త జోనల్ విధానాన్ని ఖరారు చేశారు. తొలుత 31 జిల్లాలకు జోనల్ విధానాన్ని రూపొందించారు. దానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ములుగు, నారాయణపేటలను సైతం కొత్తగా ఏర్పాటు చేశారు. మొత్తం 33 జిల్లాల పరిధిలో జోనల్ విధానానికి ఆమోదం కోరుతూ 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి కేంద్రం ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్త జోన్ల ప్రకారమే 50వేల ఉద్యోగాల భర్తీ
తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ విధానంతో ఉద్యోగ నియామకాలు జరగలేదు. విద్యాపరంగా సైతం ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశాల్లో రెండు జోన్లు, 10 జిల్లాల విధానం కిందనే వీటిని చేపడుతున్నారు. దీంతో సమానత్వం సాధ్యం కావడం లేదు. కొత్త జోనల్ విధానం ఆమోదం పొందడంతో కొత్త ఉద్యోగ నియామకాలు దీని కిందనే జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రకటించింది. కొత్త జోనల్‌‌ విధానం వచ్చాక వాటిని చేపట్టాలనే భావనతో ఉంది. కొత్త విధానంతో నియామకాలు చేపడితే హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల మాదిరే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి సహా అన్ని జిల్లాల్లోని వారికి ఉద్యోగాలు దక్కనున్నాయి. విద్యాపరంగానూ అన్ని జిల్లాలకు ప్రవేశాలు దక్కుతాయి.
రెండు జోన్ల స్థానంలో ఏడు జోన్లు
ఇకపై జిల్లాలు, జోన్లవారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు కానుంది. దీని ఆధారంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపుల ప్రక్రియ జరుగుతుంది. కొత్తగా నియమితులైన వారికి జోనల్ కేటాయింపులు సులభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు జోన్లు ఉండగా, వీటి స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పాటు చేశారు.

ఏడు జోన్ల వివరాలు

1. కాళేశ్వరం జోన్
భూపాలపల్లి, మంచిరాల్య, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు
2. బాసన జోన్
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు
3. రాజన్న జోన్
కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు
4. భద్రాద్రి జోన్
వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు
5. యాదాద్రి జోన్
సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు
6. చార్మినార్ జోన్
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు
7. జోగుళాంబ జోన్
మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలు

వీటిలో తొలి నాలుగు జోన్లను ఒక మల్టీ జోన్‌గా, తర్వాతి మూడు జోన్లను మరో మల్టీజోన్‌గా పరిగణిస్తారు. ఇప్పటి వరకూ నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లానే స్థానికతగా పరిగణిస్తారు. ఇక నుంచి ఏడవ తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు.

Centre approval to 7 new zones in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News