Tuesday, January 14, 2025

పసుపు రైతుకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

పసుపు రైతుల కల నేటికి ఫలించింది. ఎన్నో ఏండ్లుగా వారు ఎదుర్కొంటున్న కష్టాలను కేంద్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలకు తెరదీస్తూ కేంద్ర ప్రభుత్వం పసుపు పంటను ఒక ప్రత్యకమైన పరిశ్రమగా గుర్తిస్తూ పసుపు బోర్డును ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు రాజకీయాలకు కేంద్రం తెరదించింది. సంక్రాంతి పండగ సందర్భంగా జాతీయ పసుపుబోర్డు ఏర్పాటుకు అధికారికంగా వెల్లడించడంతో పాటు పసుపుబోర్డుకు తొలి చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినేట్(ఏసీసీ) నోటిఫికేషన్‌కు విడుదల చేసింది. నిజామాబాద్ జిల్లా అర్మూర్ మండలం పరిధిలోని అంకాపూర్ గ్రామానికి చెందిన పల్లె గంగారెడ్డి మూడు సంవత్సరాల పాటు జాతీయ పసుపుబోర్డు చైర్మన్‌గా కొనసాగుతారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయం వల్ల రాష్ట్రంలో పసుపు రైతుల పసుపపంట ఉత్పత్తులకు సంపూర్ణ న్యాయం జరిగే అవకాశాలున్నాయి.

నేడు పసుపు బోర్డుకు శ్రీకారం
నిజామాబాద్‌లో మంగళవారం నాడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం అధికారికంగా జరుగుతుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోల్ వర్చువల్‌గా జాతీయ పసుపుబోర్డును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జాతీయ పసుపుబోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి బాధ్యతలు చేపట్టడంతో పాటు పసుపురైతుల సమస్యల పరిష్కారంపై విధానపరమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.
రైతులకు మంచి అవకాశాలు
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు కొత్త అవకాశాలు కలుగనున్నాయి. పసుపు పంటకు గిట్టుబాటు ధరలు దక్కనున్నాయి. బోర్డు ద్వారా పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే అవకాశాలు లేకపోలేదు. ఇకపై పసుపు ఎగుమతులకు గణనీయమైన అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

37ఏండ్ల కల నెరవేరింది
కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. పసుపురైతుల కష్టాలను గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బోర్డు ఏర్పాటుచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ 37 సంవత్సరాల పసుపురైతుల కల ఈనాడు నెరవేరడం సంతోషకరమన్నారు.
ప్రధాని రైతుల పక్షపాతి ః కిషన్ రెడ్డి
జాతీయ పసుపుబోర్డు ఏర్పాటుచేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతు పక్షపాతిగా చాటుకున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News