న్యూఢిల్లీ: ఉగాది పండుగ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ శుభవార్త వెలువడింది. వీరి కరవు భత్యం (డిఎ)ను 3 శాతం మేర పెంచుతున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. బుధవారం నాటి కేంద్ర మంత్రి మండలి సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు ఇచ్చే డిఎ, పెన్షనర్లకు ఇచ్చే డిఆర్‌ను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది, ఇది 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇప్పుడు ఈ మూడు శాతం డిఎ పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఇచ్చే డిఎ ఇకపై 34 శాతానికి చేరుకుంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 47.68 లక్షల మంది ఉద్యోగులు, 68.62 లక్షల మంది ఫించనుదార్లకు మేలు జరుగుతుంది. కేంద్ర ఖజానాపై ఈ పెంపుదల ప్రభావంతో ఏటా రూ 9544 కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్ర కేబినెట్ భేటీ తరువాత అధికారిక ప్రకటనలో తెలిపారు. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగానే ఈ డిఎ, డిఆర్ పెంపుదల నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం అయింది. దేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే ఈ హెచ్చింపు జరిగింది. ఇప్పుడు బేసిక్ పే /పెన్షన్‌లపై 31 శాతం డిఎ అందుతోంది. రిటైల్ ద్రవ్యోల్బణం లేదా వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం ఈసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అంచనా వేసిన 26 శాతం కన్నా అత్యధిక స్థాయికి చేరింది. ఈ ఏడాది వరుసగా రెండో నెల కూడా ఇదే పరిణామం చోటుచేసుకుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే ధరల సూచీకి తగు విధంగా ఉద్యోగులకు వెసులుబాటు దిశలో కేంద్రం కీలక నిర్ణయం వెలువడింది. అయితే ఇప్పటి ద్రవ్యోల్భణం డాటాలో ఇటీవలి కాలంలో ముడిచమురు ధరల పెరుగుదల పతాక స్థాయిలను మిళితం చేయలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నాటి నుంచి ముడిచమురు ధరలు బ్యారెల్ రేటున పెరుగుతూ పోతున్నాయి. దీని ప్రభావంతో ధరల ఒత్తిడి సామాన్యుడు, నిర్ణీత ఆదాయ వేతన జీవులపై మరింతగా పడుతుందని విశ్లేషిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇప్పుడు పెంచిన డిఎ ఉందా? అనేది ప్రశ్నార్థకం అవుతోంది.
డిఎ పెంపుదల ఆరు నెలల్లో ఇది రెండోసారి
కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పింఛనుదార్లకు డిఎను పెంచడం గత ఆరు నెలల్లో ఇది రెండోసారి. కొవిడ్ ఉధృతి దశలో డిఎలను నిలిపివేశారు. గత ఏడాది అక్టోబర్‌లో దీపావళి కానుకగా డిఎను ఇప్పటిలాగానే 3 శాతం పెంచారు. 2021 జులై నుంచి అది వర్తిస్తుందని ప్రకటించారు. కరోనా దశలో నిలిచిపోయిన డిఎను గత ఏడాది జులై నుంచే పునరుద్ధరించారు.
Centre Approves 3% DA Hike for Govt Employees