Sunday, January 19, 2025

పిఎఫ్‌ఐ,అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు కేంద్రం నిషేధం

- Advertisement -
- Advertisement -

Centre bans PFI and its associates for 5 years

నిషేధానికి కారణాలివే..

న్యూఢిల్లీ : ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) , దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. పీఎఫ్‌ఐ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ), ఇతర దర్యాప్తు ఏజెన్సీలతో కలిసి ఇటీవల భారీ ఆపరేషన్ చేపట్టింది. వారం వ్యవధిలో రెండు సార్లు జరిపిన ఈ సోదాల్లో 250 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులు, కార్యకర్తలను ఎన్‌ఐఎ అరెస్టు చేసింది. ఈ సోదాల్లో అనేక కీలక విషయాలు వెలుగు లోకి రావడంతో కేంద్రం ఈ సంస్థపై చర్యలు తీసుకుంది. మరి పీఎఫ్‌ఐ పై నిషేధం విధించడానికి కారణాలేంటి ? ఎన్‌ఐఎ సోదాల్లో తెలిసిందేంటీ ? వంటి వివరాలను కేంద్ర హోం శాఖ వర్గాలు, నిఘా వర్గాలు వెల్లడించాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అత్యంత శక్తిమంతమైన ఇస్లామిక అతివాద సంస్థల్లో ఒకటి. పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలు దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. హింస, నేరాలు, ఉగ్రవాదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసుల్లో పీఎఫ్‌ఐ సభ్యులు నిందితులుగా ఉన్నారు. రెండు వర్గాల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్షంగా ఈ సంస్థ తమ సభ్యులకు ఇక్షణ ఇస్తోంది. పలు రాష్ట్రాల్లో పిఎఫ్‌ఐ సభ్యులు, దాని అనుబంధ సంస్థలపై 1300 కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. యూఏపిఏ , పేలుడు పదార్ధాలు, ఆయుధాల నిరోధక చట్టాల కింద పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు ఈ కేసులు నమోదు చేశారు.

పిఎఫ్‌ఐకి అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో సంబంధాలున్నాయని అనేక సార్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కేరళలో కొంతమంది పిఎఫ్‌ఐ కార్యకర్తలు ఆ మధ్య ఇస్లామిక్ స్టేట్ సంస్థలో చేరి సిరియా, ఇరాక్, అఫ్గానిస్థాన్ వంటి దేశాల్లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్టు ఆధారాలు బయటపడ్డాయి. ఈ క్రమం లోనే ఐసిఎస్‌తో కలిసి పని చేస్తోన్న కొంతమంది కార్యకర్తలను ఎన్‌ఐఎ , రాష్ట్ర పోలీసులు గతంలో అరెస్టు కూడా చేశారు. ఇక పీఎఫ్‌ఐకి జమాత్ ఉల్ ముజాహిదీన్ తోనూ సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 2021లో కేరళలో ఓ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. అంతకు ముందు 2019లో తమిళనాడులో హిందూ నేత వి. రామలింగం కూడా హత్యకు గురయ్యాడు. ఈ కేసుల్లో పీఎఫ్‌ఐ కార్యకర్తలు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరే కాక, గతం లోనూ కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అనేక మంది హిందూ మద్దతుదారులను ఈ సంస్థ సభ్యులు హత్య చేసినట్టు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న పిఎఫ్‌ఐ సభ్యుల నుంచి అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ శిక్షణ వీడియోలు అప్పట్లో లభ్యమయ్యాయి.

2021 జూన్‌లో కేరళ లోని కొల్లాం జిల్లాలో ఓ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్ధాలు, జిహాదీ సాహిత్యాన్ని పోలీసులు గుర్తించారు. ఈ అటవీ ప్రాంతాన్ని పిఎఫ్‌ఐ మిలిటరీ శిక్షణ కేంద్రంగా ఉపయోగిస్తోంది. 2013 ఏప్రిల్ లో కేరళ లోని కన్నూర్ జిల్లాలో గల పీఎఫ్‌ఐ శిక్షణ శిబిరంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలు బయటపడ్డాయి. అప్పట్లో దానిపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టగా, 41 మంది పిఎఫ్‌ఐ సభ్యులను కోర్టు దోషులుగా తేల్చింది. యువతకు నైపుణ్యాల శిక్షణ ముసుగులో పీఎఫ్‌ఐ … మిలిటరీ తరహా శిక్షణ ఇస్తోందన్న ఆరోపణలున్నాయి. ఓ వర్గానికి వ్యతిరేకంగా యువతలో ద్వేష భావాన్ని నింపుతూ దాడులకు శిక్షణ ఇస్తోందని దర్యాప్తులో తేలింది. సామాజిక సంస్థగా చెప్పుకొనే పీఎఫ్‌ఐ, ఈ ఏడాది కర్ణాటక లోని ప్రముఖ హిందూ కార్యకర్త ప్రవీణ్ నెట్టారును అతి దారుణంగా హత్య చేసింది. ఆ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అరెస్టయిన వారంతా పీఎఫ్‌ఐ కార్యకర్తలే. పీఎఫ్‌ఐ తన కార్యకలాపాల కోసం దేశ విదేశాల నుంచి నిధులు అందుకుంటోంది. ఇవన్నీ అనుమానాస్పద వ్యక్తులు, సంస్థల నుంచి వస్తున్నవే. పీఎఫ్‌ఐకు చెందిన 100 కు పైగా బ్యాంకు ఖాతాలు… ఖాతాదారుల ఆర్థిక వివరాలతో సరిపోలట్లేదని దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి. అందువల్ల ఐటీ చట్టం లోని కొన్ని సెక్షన్ల కింద పీఎఫ్‌ఐ రిజిస్ట్రేషన్ హోదాను కేంద్రం ఉపసంహరించింది. ఇటీవల ఎన్‌ఐఏ జరిపిన సోదాల్లోనూ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి అనేక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ సంస్థ సభ్యుల ఇళ్లల్లో బాంబు తయారీ పత్రాలు , ఐసిఎస్ వీడియోలను అధికారులు గుర్తించారు. భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే లక్షంగా ఈ సంస్థ కుట్ర పన్నినట్టు అధికారులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News