ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికార నివాసంలో భారీ స్థాయిలో నగదు కట్టలు బహిర్గతమైనట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను పూర్వపు అలహాబాద్ హైకోర్టుకు బదలీ చేసినట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. న్యాయమూర్తి బదలీని ప్రకటిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీం కోర్లు కొలీజియం సోమవారం ఆయన బదలీకి సిఫార్సు చేస్తూ, ఈ నెల 14న హోలీ రోజు రాత్రి జస్టిస్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం తరువాత నగదు బయటపడినట్లు ఆరోపణ వచ్చిన దృష్టా అంతర్గత దర్యాప్తునకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశంతో ఆయన బదలీకి సంబంధం లేదని స్పష్టం చేసింది.
సోమవారం ఎస్‌సి తీర్మానం ప్రకారం, ‘ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదలీ చేయాలని సుప్రీం కోర్టు ఈ నెల 20. 24 తేదీల్లో నిర్వహించిన సమావేశాల్లో సిఫార్సు చేసింది’. జస్టిస్ వర్మపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ అంతర్గత దర్యాప్తు ప్రారంభించారని, ఆయన బదలీకి విడిగా ఒక ప్రతిపాదన ఉందని సుప్రీం కోర్టు 21న తెలియజేసింది. 20న సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం సమావేశానికి ముందు జస్టిస్ ఉపాధ్యాయ దర్యాప్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, తన నివాసంలోని స్టోర్ రూమ్‌లో ఎటువంటి నగదూ ఉంచలేదని జస్టిస్ వర్మ ‘నిర్దంద్వంగా’ ఖండించారు.