Thursday, January 23, 2025

ఇన్సులిన్ అందకుండా చేసి.. కేజ్రీవాల్‌ను చంపాలని చూస్తున్నారు: సునీత కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

షుగర్‌తో 12 ఏండ్లుగా ఇదే చికిత్స
నిలిపివేస్తే ఆయన బతుకుతారా?
రాంచీ సభలో నిలదీసిన సునీతా కేజ్రీవాల్

రాంచీ: బిజెపి కక్షా రాజకీయాలు పరాకాష్టకు చేరాయని అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. తన భర్త కేజ్రీవాల్‌కు జైలులో ఇన్సూలిన్ అందకుండా చేసి, జైలులోనే చంపేసేలా ఉన్నారని ఆమె తీవ్రస్థాయిలో ఆరోపించారు. కేజ్రీవాల్‌ను లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఇప్పుడు అదునుకోసం చూస్తోందని అన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఆదివారం ఇండియా కూటమి తరఫున జరిగిన ఉల్గులన్ న్యాయ్ ర్యాలీలో మాట్లాడారు.

బిజెపి నియంత్రత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరు సాగిస్తుందని, ఈ క్రమంలో విజయం సాధిస్తామని సునీత తెలిపారు. తీహార్ జైలులో కేజ్రీవాల్ పరిస్థితి దుర్భరంగా ఉందని, ఆయన అక్కడనే ఏదోవిధంగా చనిపోయ్యేలా చేయడానికి పావులు కదిపారని విమర్శించారు. ఇన్సూలిన్ ఇవ్వడంలేదు. తీసుకునే ఆహారంపై సిసిటీవీలతో నిఘా పెట్టారని అన్నారు. తన భర్తకు షుగర్ ఉందని, 12 ఏండ్లుగా ఇన్సులిన్‌తోనే చికిత్స సాగుతోందని, రోజకు కనీసం 50 యూనిట్ల వరకూ ఇది కావల్సిందే అన్నారు. అయితే దీనిని నిరాకరించడం ద్వారా ఏమి చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు.

ఆయన ప్రజాసేవకు అంకితభావంతో ముందుకు కదిలినందునే జైలు పాలుచేశారని చెప్పారు. ఆయనపై అభియోగాలు ఏవీ కూడా రుజువు కాలేదన్నారు. జైలు గోడలు బద్ధలు అవుతాయి. కేజ్రీవాల్, జార్ఖండ్ నేత సోరెన్ బయటకు వస్తారని స్పందించారు. కేజ్రీవాల్‌ను ఇడి మార్చి 21న మద్యం పాలసీ స్కాం కింద అరెస్టు చేసి జైలుకు పంపించింది. కాగా జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్ భూ మోసాల కేసు సంబంధిత మనీలాండరింగ్ కేసు క్రమంలో ఇడి జనవరి 31వ తేదీన అరెస్టు చేసి జైలుకు తరలించింది.

వేదికపై కేజ్రీవాల్, సోరెన్ కోసం ఖాళీ కుర్చీలు
రాంచీలో ఇండియా కూటమి నేపథ్యంలో వేదికపై రెండు ఖాళీ కుర్చీలను ఉంచారు. జైలుపాలయిన నేతలు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్‌లకు ఈ ఖాళీ కుర్చీలను కేటాయించామని ఇండియా కూటమి నేతలు తెలిపారు. ఇక్కడ సభ దాదాపుగా పూర్తిస్థాయిలో స్థానిక జార్ఖండ్ ముక్తిమోర్చా (జెఎంఎం) ఆధ్వర్యంలోనే జరిగింది. సభకు అత్యధిక సంఖ్యలో జెఎంఎం కార్యకర్తలు సోరెన్ ముఖాల మాస్క్‌లు వేసుకున్నారు. ఆయన తమతోనే ఉన్నారని కార్యకర్తలు చాటుకున్నారు. జార్ఖండ్‌లో వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరిన దశలో ఈ సభ జరిగింది. జెఎంఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ నేతకోసం నినాదాలకు దిగారు.

జైలు తాళాలు విరిగిపోతాయి, సోరెన్ బయటకు వస్తారు. జార్ఖండ్ తలవంచేదిలేదనే నినాదాల మిన్నంటాయి. ఈ సభకు సోరెన్ సతీమణి కల్పన, కేజ్రీవాల్ భార్య సునీత, నేషనల్ కాన్ఫరెన్స్ నేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎస్‌పి నాయకులు అఖిలేష్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ ఇతరులు తరలివచ్చారు. విప్లవం అనే అర్థం వచ్చే ఉల్గులన్ సాధన పేరిట ఇక్కడి సభను నిర్వహించారు. బ్రిటిష్ హయాంలో ఆదివాసీల తరఫున వారి హక్కుల కోసం అప్పట్లో వారి నుంచి వచ్చిన నేత బిర్సా ముండా ఇచ్చిన పిలుపే ఈ ఉల్గులన్, దీనినే ఇక్కడ వాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News