Monday, December 23, 2024

కొత్త క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చే ముందు సంప్రదించాల్సింది: మద్రాస్ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిసి, సిఆర్ పిసి స్థానంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు తీసుకొచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం లా కమిషన్ ను సంప్రదించి ఉండాల్సిందని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ‘రాజ్యాంగ విరుద్ధం అని వాటిని ప్రకటించాలి’ అంటూ  డిఎంకె ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్. భారతి వేసిన రిట్ పిటిషన్ ను శుక్రవారం విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.

‘లా కమిషన్ ఉన్నదే అందుకు (న్యాయపరమైన విషయాల్లో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకే)’’ అని న్యాయమూర్తులు ఎస్ఎస్. సుందర్, ఎన్. సెంథిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.

కేంద్ర ప్రభుత్వం ఎందుకని పాత వాటి స్థానంలో మూడు కొత్త చట్టాలు  తేవాలనుకుంటోంది? ఒకవేళ మార్పులు తేవాలనుకుంటే ఉన్న చట్టాలలోనే సవరణలు చేయొచ్చు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షసంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే మూడు కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తేవాలనుకుంటోంది. తికమక చేయడానికి, ప్రత్యేక భాష్యం చెప్పడానికి, న్యాయాన్ని ఆలస్యం చేయడానికి ఇలా చేసి ఉంటుంది. ‘‘ఉద్దేశం మంచిదే కావొచ్చు, కానీ దాని వల్ల ఆలస్యం జరుగొచ్చన్నదే మా ఆందోళన’’ అని కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఎలాంటి అర్థవంతమైన చర్చ నిర్వహించకుండానే పార్లమెంటు కొత్త చట్టాలను తీసుకొచ్చిందని భారతి తరఫున ప్రాతినిధ్యం వహించిన సీనియర్ అడ్వొకేట్ ఎన్.ఆర్. ఇలంగో ఆక్షేపణ తెలిపారు. ‘‘ కొత్త చట్టాల్లో చెప్పుకోతగ్గ మార్పు ఏమి లేదు. సెక్షన్లను షఫ్లింగ్ చేశారంతే. దాంతో అసౌఖర్యం, అయోమయం తప్ప ఏమి ఉండదు. షఫ్లింగ్ వల్ల న్యాయమూర్తులు, న్యాయవాదులు, చట్టాలను అమలుచేసే సంస్థలు, ప్రజలు అయోమయంకు గురవుతారంతే’’ అని ఇలంగో వివరించారు.

కాగా ఈ వినతులపై ప్రతిస్పందించేందుకు కొంత సమయం కావాలని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. దాంతో కేసును నాలుగు వారాలకు వాయిదా వేశారు. పైగా మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్ ను ఇతర ఇలాంటి సవాలు చేసే వినతులతో చేర్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News