ఢిల్లీలో అధికారాలపై కేంద్రం రాష్ట్రప్రభుత్వం వివాదం
విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు
ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామన్న చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లెజిస్లేటివ్, కార్యనిర్వాహక అధికారాల పరిధికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య నెలకొన్న వివాదంలో న్యాయపరమైన అంశాలను పరిశీలించడానికి ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. ఈ విషయాన్ని అత్యవసరంగా విచారించాలని ఆప్ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎఎం సింఘ్వి ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు కృష్ణ మేరారి, హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని కోరినప్పుడు దీన్ని విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ సమాధానమిచ్చారు. ఢిల్లీలో సేవలపై కంట్రోల్ ఎవరిదనే అంశాన్ని సుప్రీంకోర్టు గత మే 6న అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించింది. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని కోరుతున్న కేంద్రానికి ఊరట కల్పిస్తూ న్యాయపరమైన అన్ని అంశాలను విస్తృతంగా పరిశీలించిన రాజ్యాంగ ధర్మాసనం సేవలపై కంట్రోల్ ఎవరిదనే పరిమిత అంశాన్ని పరిశీలించలేదని ఆ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల దీనిపై రాజ్యాంగ ధర్మాసనం సాధికారిక తీర్పు ప్రకటించడం సముచితమని తాము భావిస్తున్నట్లు కూడా సుప్రీంకోర్టు అప్పట్లో పేర్కొంది.
Centre-Delhi Govt Dispute over Control of Services