న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అర్వింద్ కేజ్రీవాల్ హత్యకు బిజెపి నేతృత్వంలోని కేంద్రం, ఢిల్లీ పోలీసులు కుట్ర పన్నుతున్నట్లు ఆప్ శుక్రవారం ఆరోపించింది. ఉపసంహరించిన పంజాబ్ పోలీస్ భద్రతను పునరుద్ధరించవలసిందిగా ఎన్నికల కమిషన్ (ఇసి)కి ఆప్ విజ్ఞప్తి చేసింది. అయితే, ఆ ఆరోపణకు బిజెపి నుంచి గాని, ఢిల్లీ పోలీసుల నుంచి గానీ వెంటనే స్పందన ఏదీ రాలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ఫిబ్రవరి 5 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు ‘నిష్పాక్షిక పరిస్థితులు’, కేజ్రీవాల్‌కు పంజాబ్ పోలీస్ శాఖ కల్పించిన భద్రత పునరుద్ధరణ కోసం ఇసికి తాము లేఖ రాసినట్లు తెలియజేశారు.
కేజ్రీవాల్‌కు ‘ప్రాణానికి ముప్పు కలిగించే’ దాడులపై ఆడిట్ జరిపించాలని కూడా తాము కోరినట్లు వారిద్దరు తెలిపారు. కేంద్రం పరిధిలోకి వచ్చే ఢిల్లీ పోలీసులు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అదేశానుసారం కేజ్రీవాల్‌పై దాడులను పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ‘కేజ్రీవాల్‌జీ హత్యకు జరిగిన ఈ కుట్రలో ఇద్దరికి బిజెపి, ఢిల్లీ పోలీసుల పాత్ర ఉన్నది. వారు కేజ్రీవాల్‌ను అంతం చేయాలని కుట్ర పన్నుతున్నారు. ఆయనపై ఒకదాని తరువాత ఒకటిగా దాడులు జరుగుతున్నాయి. (నిరుడు) అక్టోబర్‌లో కేజ్రీవాల్‌పై ఒక దాడి జరిగింది. మేము దర్యాప్తు చేయగా, ఆ దుండగులు బిజెపి కార్యకర్తలను తేలింది, కానీ పోలీసులు ఎటువంటి చర్యా తీసుకోలేదు’ అని ఆతిశీ ఆరోపించారు. కేజ్రీవాల్‌కు భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ మేము ఇసికి లేఖ రాశాం. ఢిల్లీ పోలీస్ శాఖ అమిత్ షా నియంత్రణలో ఉన్నందున దానిని మేము విశ్వసించం’ అని ఆతిశీ తెలిపారు. ఢిల్లీ ఎన్నికల ముందు ‘చెత్త రాజకీయాలకు’ పాల్పడుతూ బిజెపి కేజ్రీవాల్‌కు భద్రత తొలగించేందుకు కుట్ర పన్నిందని ఆప్ నేతలు ఆరోపించారు.