కోవిడ్ నిబంధనలు సడలించిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశవిదేశాల్లో రెండేళ్లుగా విమానాల ప్రయాణాలపై మహమ్మారి కారణంగా ప్రేరేపిత నిషేధం ఉంది. అయితే రేపటి నుంచి అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలు, విమానాలలో ప్రస్తుతం ఉన్న కొవిడ్19 ఆంక్షలను కేంద్రం సడలించినట్లు ప్రకటించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనల ప్రకారం క్యాబిన్ క్రూ సభ్యులు ఇకపై వ్యక్తిగత రక్షణ పరికరాలు(పిపిఇ) కిట్‌లను ధరించాల్సిన అవసరం లేదు. కాగా విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది ప్రయాణికులను అవసరమనుకున్న చోట్ల శోధించవచ్చు(ప్యాట్‌డౌన్ సెర్చ్ చేయొచ్చు). వైద్య అత్యవసరం కోసం అంతర్జాతీయ విమానయాన సంస్థలు మూడు సీట్లను ఖాళీగా ఉంచాల్సి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. కాగా ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్ల నిర్వహణ ఇప్పటికీ విమానాశ్రయాల్లో, విమానాల్లో తప్పనిసరి అని పేర్కొంది.
ఓమిక్రాన్ వేరియంట్‌తో పడకేసిన విమానయానం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఫిబ్రవరిలో దాదాపు 76.96 లక్షల మంది దేశీయ ప్రయాణికులు విమానంలో ప్రయాణించారు. జనవరితో పోలిస్తే ఇది దాదాపు 20 శాతం ఎక్కువ.
2021 అక్టోబర్ 18 నుంచి దేశీయ విమాన కార్యక్రమాలను ప్రభుత్వం అనుమతించింది. దేశంలో శనివారం 1660 కొత్త కొవిడ్19 కేసులు నమోదయ్యాయి. రోజువారి సంక్రమణలు, మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. మరోవైపు చైనా, అనేక ఐరోపా దేశాలలో కొత్త కరోనా వేరియంట్‌లు వెలుగుచూస్తున్నాయి. అవి అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రూపాంతరాలు.