ఉగ్రవాదులు అనుకునే పౌరులపై కాల్పులు
సిట్ నివేదిక తర్వాత బాధ్యులపై చర్యలు
భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరించాం
నాగాలాండ్‌లో ఆర్మీ కాల్పుల ఘటనపై పార్లమెంట్‌లో హోంమంత్రి అమిత్ షా ప్రకటన
న్యూఢిల్లీ : నాగాలాండ్‌లో సామాన్యులపై అస్సాం రైఫిల్స్ జవాన్లు జరిపిన కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారంనాడు లోక్‌సభలో వివరణ ఇచ్చారు. ఉగ్రవాదులనే అనుమానంతోనే భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని తెలిపారు. జరిగిన పొరబాటుకు కేంద్రం తీవ్ర పశ్చాత్తాపం ప్రకటిస్తోందన్నారు. ఘటనపై సిట్ ఏర్పాటు చేశామని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై ఆర్మీ ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. దీంతో పాటు సిట్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నెల రోజుల్లోగా నివేదిక ఇస్తుందని, బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని భద్రతా బలగాలను హెచ్చరించినట్లు అమిత్ షా తెలిపారు. ‘ఓటింగ్, మోన్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఆర్మీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో 4వ తేదీన ఆ ప్రాంతాల్లో ఆర్మీ 21 పారా కమాండో యూనిట్ మెరుపు దాడి చేపట్టింది. ఈ క్రమంలో ఓ వాహనం అటుగా వస్తుండగా భద్రతా బలగాలు ఆపమని చెప్పాయి.
అయితే వారు ఆగకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అందులో ఉన్నది ఉగ్రవాదులు అని అనుమానించిన దళాలు, ఆ వాహనంపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఆరుగురు మరణించారు. అయితే ఆ తర్వాత పొరబాటు జరిగిందని గుర్తించిన బలగాలు వాహనంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. అయితే కాల్పుల విషయం తెలియగానే స్థానిక గ్రామాల ప్రజలు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి దాడి చేశారు. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆత్మ రక్షణ కోసం సైనిక బలగాలు మళ్లీ కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పౌరుల దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత డిసెంబరు 5 సాయంత్రం కూడా స్థానికులు ఆర్మీ ఆపరేటింగ్ బేస్‌పై దాడికి దిగారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అస్సాం రైఫిల్స్ కాల్పులు జరిపాయి.
ఈ ఘటనలో మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు’ అని అమిత్ షా చెప్పారు. ఘటన గురించి తెలియగానే నాగాలాండ్ ఉన్నతాధికారులతో తాను స్వయంగా మాట్లాడానని షా అన్నారు. ఘటన జరిగిన ప్రాంతాల్లో శాంతి భద్రతలను అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అయితే సామాన్య పౌరులు మృతి చెందడం దురదృష్టకరమని, దీనికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో చింతిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామన్నారు. అయితే నాగాలాండ్ ఘటనపై చర్చ జరపకుండా కేంద్రమంత్రి అమిత్ షా కేవలం వివరణ మాత్రమే ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. దీనిపై సవివర చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ సభలో ఆందోళనకు దిగాయి. అయితే స్పీకర్ అందుకు అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
రాజ్యసభలోనూ అమిత్ షా ప్రకటపై నిరసన…
12మంది ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న డిమాండ్‌తో ప్రతిపక్షాలు వెల్‌లోకి వెళ్లి నిరసనలు తెలపడంతో సోమవారం రాజ్యసభలో ఎలాంటి చర్చా జరగకుండానే వాయిదా పడింది. ఉదయం నుంచి మొత్తం నాలుగుసార్లు వాయిదా పడింది. చివరగా సాయంత్రం 4 గంటలకు సమావేశమైనపుడు చైర్మన్ స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హారివంశ్ నాగాలాండ్ కాల్పుల ఘటనపై వివరణ ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్‌షాకు అవకాశం కల్పించారు. ఈ నెల 4,5 తేదీల్లో వరుసగా జరిగిన ఘటనలపై లోక్‌సభలో ఇచ్చిన వివరణనే రాజ్యసభలోనూ అమిత్‌షా కొనసాగించారు. అమిత్‌షా ప్రకటన సమయంలోనూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నాగాలాండ్ ఘటనపై చర్చకు పట్టుపట్టారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌సహా ప్రతిపక్షాలు 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న డిమాండ్‌తో నిరసన తెలపడంతో రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడింది.