Sunday, December 22, 2024

80 కోట్ల ఆకలి కడుపులు

- Advertisement -
- Advertisement -

ఎలుగుబంటి తోలు ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు కాదు అని నానుడి. ఇక్కడ నలుపు చెడ్డది, తెలుపు మంచిది అని కానే కాదు. పరిస్థితిలో ఎప్పటికీ మార్పు లేదని చెప్పడమే దీని ఉద్దేశం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి, రిపబ్లిక్‌గ్గా అవతరించి ఇన్నేళ్ళయిందని ఏటా ఆగస్టు 15 తేదీనో, జనవరి 26 నో లెక్కలు చెప్పుకొంటాం. కాని వాటి వయసులో వచ్చిన పెరుగుదల దేశ ప్రజల జీవన స్థితిగతుల్లో ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానం అత్యంత నిరాశాజనకంగా వుంటుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వర్గం బుధవారం నాడు తీసుకొన్న ఒక నిర్ణయం ధ్రువపరుస్తున్నది. దేశంలోని 81.35 కోట్ల మంది ప్రజలకు ఒక్కొక్కరికి నెలకు ఐదేసి కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్న పథకాన్ని ఐదేళ్ళ పాటు కొనసాగించడానికి కేంద్ర కేబినెట్ బుధవారం నాడు నిర్ణయం తీసుకొన్నది. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్ళలో ప్రభుత్వం రూ. 11.8 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వుంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ సందర్భంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ పొడిగింపు నిర్ణయాన్ని ఇటీవల చత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలోనే ప్రధాని మోడీ వెల్లడించారు. దానికి ఇప్పుడు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అయితే ఇది ఇప్పుడే కొత్తగా ఊడిపడిన పథకం కూడా కాదు. 2020లో కొవిడ్19 లాక్‌డౌన్‌లో సాధారణ ప్రజలు ఉపాధులను కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరిట కేంద్రం ఈ పథకాన్ని మొదటిసారి అమల్లోకి తెచ్చింది. దాని గడువు 2022 డిసెంబర్‌తో ముగిసిపోడంతో మరొక సంవత్సరం పొడిగించారు. అది ఈ డిసెంబర్‌తో అంతం అవుతుంది. అందుచేత మరి ఐదేళ్ళ పాటు కొనసాగించాలని 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్రం ఇప్పుడు నిర్ణయం తీసుకొన్నది. ప్రజలకు నిరంతర ఆహార భద్రతను కలిగించే చర్యను ఎంత మాత్రం తప్పు పట్టవలసిన పని లేదు. దానిని స్వాగతించాల్సి వుంది కూడా. అయితే ఈ నిర్ణయం లోతులకు వెళ్ళి చూస్తే దేశ జనాభా (140 కోట్ల పైచిలుకు) లో 60 శాతానికి పైగా ఇప్పటికీ రోజువారీ తిండి లేని దుస్థితిలో వున్నారని బోధపడుతున్నది. అటువంటప్పుడు 75 ఏళ్ళకు పైబడిన స్వతంత్ర భారతంలో సాధించిన మంచి ఏమిటి అనే ప్రశ్న తలెత్తి గుండె బేజారెక్కించడం లేదా! కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా లక్షల కోట్ల రూపాయలను పేదల సంక్షేమం కింద ఖర్చు పెడుతున్నాయి.

అలాగే ఎప్పటికప్పుడు చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టుల కింద అంతకు మించిన ధనాన్ని ఖర్చు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో పని చేసే వారికి జీతభత్యాల కింద ఆ సొమ్ములో గణనీయమైన భాగం ఖర్చవుతున్నది. అయినా ప్రజల రోజువారీ ఆహార అవసరాలు వాటి ద్వారా తీరడం లేదని రూఢి అవుతున్నది. 60 శాతానికి మించిన జనాభాకు ఉచిత ఆహార ధాన్యాల సరఫరాను కొనసాగించవలసిన అవసరం కలగడంలో ఇది స్పష్టపడుతున్నది. 2 రూపాయలకే కిలో బియ్యం, 3 రూపాయలకే కిలో గోధుమ, ఒక్క రూపాయికే కిలో బియ్యం వంటి పథకాలు కొన్ని రాష్ట్రాల్లో అమలయ్యాయి. ఇప్పుడు ఉచిత బియ్యం పథకం మరి ఐదేళ్ళ పాటు కొనసాగించవలసి వస్తున్నది. అందుకే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఒకప్పుడు చెప్పిన ఒక మాటను సుప్రీం కోర్టు కూడా ఒక దశలో ప్రస్తావించవలసి వచ్చింది. ప్రభుత్వం ప్రజల మీద ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో వారికి చేరుతున్నది 15 పైసలేనని ఆయన 1985లో ప్రకటించారు. అంటే మిగతా 85 పైసలు అవినీతిపరుల జేబుల్లోకి పోతున్నది అని ఆయన ఉద్దేశం. అందులో ఏ మాత్రం అవాస్తవం లేదని గట్టిగా చెప్పవచ్చు.

పేదవారిని శాశ్వతంగా బాగు చేయడానికి ఉద్దేశించిన పథకాల కింద పెడుతున్న ఖర్చులో ఇంత భాగాన్ని మార్గమధ్యంలో పంది కొక్కులే స్వాహా చేస్తుంటే ఇక ఈ దేశం బాగు పడేదెప్పుడు? ఇలా ఎల్లకాలం ఉచిత సరఫరాలు చేయనవసరం లేకుండా వుండాలంటే ఈ పందికొక్కులను శాశ్వతంగా అరికట్టాలి. మోడీ వంటి అత్యంత సమర్థుడుగా బాకా ఊదించుకొంటున్న ప్రధానికే అవినీతి నిర్మూలన సాధ్యం కావడం లేదని ఈ పథకాన్ని మరి ఐదేళ్ళ పాటు పొడిగించాలన్న నిర్ణయం చాటుతున్నది. నిజానికి అవినీతి నిర్మూలన ఇటువంటి ప్రధానులకే బొత్తిగా సాధ్యపడదు. ఎందుకంటే దశాబ్దాల తరబడి దేశ ప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న పబ్లిక్ రంగ సంస్థలను కారు చవకగా కార్పొరేట్లకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి వుంటుం దా! కాకులను కొట్టి గద్దలకు వేసే పాలకుల వల్ల ప్రజలు బాగు పడడం అనేది కల్ల. వారిని కాల్చుకు తింటున్నవారే దాని వల్ల మేలు పొందుతారు. అందుచేత దేశంలో అవినీతిని మూలమట్టంగా తొలగించవలసి వుంది. అప్పుడే ప్రజల శ్రమకు నిజమైన విలువ వారి చేతికి అందుతుంది. ప్రభుత్వం వద్ద చేయి చాచవలసిన దుస్థితి వారికి శాశ్వతంగా తప్పుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News