న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌పి) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి వంటి పలు వాహన సంబందిత డాక్యుమెంట్ల గడువును తాజాగా 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. దీనికి సంబందించి గురువారం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ‘కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి ఫిట్ నెస్, పర్మిట్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ ఏదైనా ఇతర సంబంధిత డాక్యుమెంట్‌ల గడువును 30 సెప్టెంబర్ 2021 వరకు పొడగిస్తున్నట్లు కేంద్రం ట్వీట్ చేసింది. గత ఏడాది ఫిబ్రవరి 1తో ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును సెప్టెంబర్ 30, 2021 నాటికి పొడగించింది.
ఈ చర్య వల్ల సామాజిక దూరాన్ని పాటిస్తూ రవాణా సంబంధిత సేవలను పొందవచ్చు అని తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో పౌరులు, రవాణాదారులు ఇబ్బందులను ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, గతంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. ఇంతకు ముందు, అభ్యర్థులు లైసెన్స్ కోసం ఆర్టివో కార్యాలయలలో డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సి వచ్చేది. కొత్త నిబందనల ప్రకారం, ప్రభుత్వం గుర్తించిన, అర్హత కలిగిన కేంద్రాల్లో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
Centre extends validity of motor vehicle documents