రాష్ట్రాలు, యుటిలకు దాదాపు 18 కోట్ల టీకాలు
ట్రిపుల్ టితో పాటు 5 సూత్రాల పథకం
కొవిడ్ ఆటకట్టుకు కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకూ 17.02 కోట్ల మేర కొవిడ్ టీకాలను ఉచితంగా అందించినట్లు కేంద్రం బుధవారం తెలిపింది. ఇందులో ఇప్పటికీ 94.47 లక్షల డోస్‌ల మేరకు టీకాలు రాష్ట్రాలు, యుటిల వద్ద ఇప్పటికీ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వివరించింది. ప్రస్తుత కరోనా ఉధృతి, టీకాల కొరత ముదురుతున్న వివాదం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి టీకాల సమాచారం వెలువడింది. కొవిడ్ 19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో కేంద్రం ముందుందని, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యం తీసుకుని ఈ దిశలో ముందుకు సాగుతున్నామని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మహమ్మారిపై పోరులో ప్రభుత్వాలన్నింటిని సమిష్టి పాత్ర దృక్పథంతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ టెస్టు ట్రాక్, ట్రీట్ (ట్రిపుల్ టి) పద్థతిలో కరోనా వైరస్‌ను సకాలంలో గుర్తించడం, పరీక్షలు చేపట్టడం, చికిత్స అందించడం జరుగుతోంది. దీనికి తోడుగా ఐదు అంశాల వ్యూహాత్మక పద్థతిలో కరోనాపై పోరు సాగుతోందని ప్రకటనలో వివరించారు. కరోనా మహమ్మారిపై తగు విధమైన నిర్వహణ, కంటైన్మెంట్ ఏర్పాట్లు వంటివి ఈ విధానంలో ఇమిడి ఉంటాయి.
సరైన ప్రవర్తన ..సమగ్ర టీకాలు
ప్రస్తుత దశలో పౌరులు ఈ వైరస్ పట్ల సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంది. ఇదే సమయంలో అధికార యంత్రాంగం తరఫున అవసరం అయిన వారందరికీ టీకాలు అందుబాటులోకి రావాలి. కేంద్ర ప్రభుత్వ పంచసూత్ర పథకంలో ఇవి కీలకమైనవి. ఈ నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వేగవంతపు, సార్వత్రికపు టీకాల పంపిణీని చేపట్టారు. దీనికి సంబంధించి కొత్తగా అర్హులైన ప్రజానీకానికి టీకాల కోసం నమోదు ప్రక్రియ గత నెల 28 నుంచే ఆరంభం అయింది. 18 ఏండ్లు పై బడ్డ వారికి టీకాలు వేస్తారు. ఈ పరిధిలోకి వచ్చే అర్హులు అంతా నేరుగా తమ పేర్లను కొవిన్ పోర్టల్ ద్వారా కానీ ఆరోగ్య సేతు యాప్‌నుంచి కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. కేంద్రం నుంచి ఇప్పటికీ దాదాపు 17 కోట్ల డోస్‌లకు పైగా టీకాలు ఉచితంగా అందించారు. ఇందులో దాదాపు 17 లక్షల డోస్‌ల వరకూ వివిధ కారణాలతో వృధా అయ్యాయి. వచ్చే మూడు రోజులలోపే రాష్ట్రాలు, యుటిలకు అదనంగా 36 లక్షల డోస్‌ల వరకూ టీకాలు పంపిణీ చేస్తారని వివరణలో తెలిపారు.
Centre gave 17 crore free Vaccines for States and UT