న్యూఢిల్లీ: సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతోంది. తిరుగుబాటుదారులు ఒక్కోనగరాన్ని ఆక్రమిస్తుండటంతో ప్రభుత్వ దళాలు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. భారత పౌరులు తక్షణం ఆ దేశాన్ని వీడాలని శుక్రవారం అర్ధరాత్రి తరువాత అడ్వైజరీ జారీ చేసింది. “సిరియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్టా భారత పౌరులెవరూ తదుపరి నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఆ దేశానికి వెళ్లొద్దని వెళ్లొద్దని సూచిస్తున్నాం.
ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలి. అత్యవసర పరిస్థితుల్లో డమాస్కస్ లోని ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉండాలి. అత్యవసర సహాయం కోసం 963993385973.hoc.damascus @mea.gov.inను సంప్రదించాలి. సిరియాలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి” అని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
సిరియాలో 90 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 14 మంది యుఎన్ సంస్థల్లో పనిచేస్తున్నారు. వారి రక్షణ, భద్రతపై అత్యంత చేరువగా ఉండటమే తమ మిషన్ లక్షమని జైస్వాల్ తెలియజేశారు. దాదాపు దశాబ్దం పాటు అంతర్యుద్దంతో తల్లడిల్లి, గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. బషర్ అల్ అసద్ నేతృత్వం లోని ప్రభుత్వ దళాల్ని వెనక్కినెడుతూ.. ఇప్పటికే పలు కీలక పట్టాలను తమ నియంత్రణ లోకి తీసుకున్నారు. ఇక తిరుగుబాటుదారుల తదుపరి లక్షం రాజధాని డమాస్కస్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ నగరాన్ని కూడా ఆక్రమిస్తే సిరియా పూర్తిగా రెబల్స్ చేతుల్లోకి వెళ్లిపోతుంది.