Monday, January 27, 2025

యుద్ధం చివరి అంచున మావోయిస్టులు

- Advertisement -
- Advertisement -

‘భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) చివరి శ్వాస తీసుకుంటున్నది. నక్సలైట్ విముక్త భారత్ కోసం సాయుధ బలగాలు అత్యంత ధైర్యసాహసాలతో 14 మంది మావోయిస్టులను నేల కూల్చారు’ చత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తక్షణ స్పందన ఇది. ‘పార్టీ తుపాకీని ఆదేశిస్తుంది కానీ పార్టీని తుపాకీ ఆదేశించకూడదు’ అని మావో అన్నాడు. ‘అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటి విప్లవానికి బలమైన సైనిక మద్దతును కూడగట్టడం. బలప్రయోగాన్ని ఆశ్రయించకుండా రాజకీయ అధికారాన్ని సాధించలేం. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది. విప్లవం ఒక వర్గం మరొక వర్గాన్ని పడగొట్టే హింసాత్మక చర్య.

విప్లవ యుద్ధం అనేది ప్రజల యుద్ధం. ప్రజలను సమీకరించడం ద్వారా, వారిపై ఆధారపడటం ద్వారా మాత్రమే దీనిని సాధించవచ్చు. పోరాటానికి చెందిన అత్యున్నత రూపం యుద్ధం” అన్నది మావో సూత్రీకరణ. అయితే ఈ దేశంలో మావోయిస్టు పార్టీ చేస్తున్న పోరాటాలను తుపాకీ శాసిస్తోందా? అనే సందేహాలున్నవి. ‘రాజ్యం’ బలప్రయోగంతో అణచివేస్తుంటే, వందలాది అమాయకులను, పార్టీ సానుభూతిపరులను కాల్చి చంపుతుంటే తమకు కూడా ‘సైనిక సంపత్తి’ అవసరమేనన్నది మావోయిస్టుల వాదన. భారతదేశం సహా మరికొన్ని దేశాల్లో జరుగుతున్న ఇతర ఆధునిక విప్లవాలతో మావో ఆలోచనలను పోల్చవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతుంది. భారత సైన్యం పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న నేపథ్యంలో మావోయిస్టులు భారీ మూల్యం చెల్లించుకోకతప్పడం లేదు. ఇండియాలో మావోయిస్టు పార్టీ ‘నూతన ప్రజాస్వామిక విప్లవ’ లక్ష్యాన్ని చేరుకోగలదా? అందుకు తగిన వాతావరణం ఉందా? అని చాలా కాలంగా ప్రశ్నలున్నవి.సాయుధ పోరాటమే శరణ్యమా? మరో మార్గం లేదా? అని కొందరు మేధావులు అంటున్నారు. నిజంగానే ఈ ప్రశ్న తాజా పరిస్థితుల్లో మావోయిస్టులకు ఒక ఛాలెంజ్.

‘విప్లవ యుద్ధం’లో ఏ పద్ధతులు అనుసరించాలన్నది విప్లవ పార్టీ ఎత్తుగడలకు, వ్యూహాలకు సంబంధించినది. ఇది మార్క్సిస్టు ప్రాథమిక సూత్రం. ఈ సూత్రాన్ని మావోయిస్టు పార్టీ పాటించడం లేదన్న విమర్శలు విప్లవాభిమానులనుంచి వస్తున్నవి. కార్ల్ మార్క్ కాలంలో కానీ, మావో కాలం లో కానీ ప్రభుత్వాలు ఇంత శక్తిమంతంగా లేవు. ఏ విప్లవమైనా ప్రారంభించే ముందు పరిస్థితులను సంపూర్ణంగా అధ్యయనం చేసి అంచనా వేయాలని కూడా మార్క్, ఎంగెల్స్ చెప్పారు. అలాంటి అంచనాల్లోనూ మావోయిస్టు పార్టీ విఫలమైందన్న భావన కలుగుతోంది. ప్రపంచంలో సోషలిస్టు శిబిరాలు కూలిపోయాక, పెట్టుబడిదారీ వ్యవస్థ, స్వేచ్ఛా వాణిజ్యం వర్ధిల్లుతున్నవి. ఈ దశలో భారతదేశంలో విప్లవం విజయవంతం కావడంపై అనుమానాలు సహజం. విప్లవం పతాక స్థాయికి చేరడానికి భారత్ చాలా దూరంలో ఉన్నది. విప్లవకారులు అత్యుత్సాహంతో కేవలం సాయుధ పోరాటాన్ని మాత్రమే ఆశ్రయించారన్న విమర్శలున్నవి. ఇదొక రకంగా ‘ఆత్మహత్యా సదృశ చర్య’ అని విమర్శించే విప్లవాభిమానులూ ఉన్నారు.

దేశ సైనిక సంపత్తి, టెక్నాలజీ, ఇతర వనరులతో పోల్చితే మావోయిస్టు పార్టీకి ఉన్న బలం చాలా తక్కువ. 2004లో సిపిఐ మావోయిస్టు పార్టీకి వైతాళికురాలు 1980 నాటి పీపుల్స్ వార్. మావోయిస్టు పార్టీగా మారాక ‘సైనికీకరణ’కు ప్రాధాన్యం పెరిగింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) ఏర్పాటు, కంపెనీలు, బెటాలియన్లు, ప్లాటూన్లు పెరిగాయి. దట్టమైన అడవుల్లో, సురక్షిత, దుర్భేద్యమైన ప్రాంతాల్లో మాత్రమే మావోయిస్టు గెరిల్లా ఆర్మీ సంచారం సాధ్యం. అందుకే మావోయిస్టులు ఛత్తీస్ గఢ్‌లోని అబూజ్‌మడ్‌ను బేస్ క్యాంపుగా మార్చుకొని సాయుధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అబూజ్ మడ్ అడవుల్లోకి ప్రభుత్వ సాయుధ దళాలు బాగా లోపలికి చొచ్చుకుపోగలుగుతున్నవి. ‘మాకూ, ప్రభుత్వ సాయుధ బలగాలకు మధ్య దూరం నానాటికీ తగ్గిపోతోంది. మాకు కిలోమీటర్ సమీపంలోనే వాళ్ళ కదలికలు ఉన్నట్టు అర్ధమవుతోంది. మేమింతకాలం దుర్భేద్యమనుకున్న ప్రాంతాలన్నీ సైనిక బలగాలు స్వాధీనపరచుకున్నాయి. మేమిక ఎటూ కదలని పరిస్థితిలో ఉన్నాం’ అని మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ డిసెంబర్‌లో తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఒకరికి ఫోన్‌లో చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దామోదర్ మాటల్ని బట్టి మావోయిస్టు పార్టీ అమిత్ షా భాష్యం ప్రకారమే ‘అంతిమ ఘడియల్లో’ ఉన్నట్టు విశ్లేషణలు వస్తున్నవి.

దేశంలో అశాంతికి కారణమని చెబుతున్న మావోయిస్టుల అంశాన్ని పరిష్కరించడం అంటే వాళ్ళను నిర్మూలించడమేనని ప్రధాని మోడీ, అమిత్ షా చాలా కాలంగా భావిస్తున్నారు. సమస్యఎంతటి తీవ్రమైనదైనా, దాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే అది మరింత జటిలం కావచ్చు. ఒక క్లిష్టపరిస్థితి కారణాలను సరిగా విశ్లేషించి గుర్తించకపోతే, దానికోసం అనుసరించే పరిష్కారమార్గాలు సమస్యకన్నా తీవ్రంగా మారవచ్చు. ప్రధాన రాజకీయ స్రవంతిలో ఈ పరిస్థితిపై నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. హార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఆదివాసులు, పేదప్రజలు, దళితులే మావోయిస్టులకు సానుభూతిపరులుగా ఉన్నారు. చాలా సందర్భాలలో ఆయా సానుభూతిపరులు సైతం ఎన్‌కౌంటర్లలో బలవుతున్నారు. మావోయిస్టుల ఏరివేత పేరిట భద్రతా దళాల అణచివేత చర్యలపై పౌర సమాజంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

1975 కల్లా దేశంలో విప్లవం విజయవంతమవుతుందని భారత నక్సలైట్ ఉద్యమ నిర్మాత చారుమజుందార్ 1969 లోనే కలగన్నారు. నిజానికి నక్సలైట్లతోనే మొదలు కాలేదు. తెలంగాణతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్టులు గతంలో సాయుధ పోరాటం చేశారు. భౌతికంగా అబూజ్‌మడ్‌ను సైనిక బలగాలు విముక్తి చేసే రోజులు ఎంతో దూరంలో లేవని అనిపిస్తోంది. మావోయిస్టులు అన్యాయంగా అంతరించిపోక తప్పదని తాజా ఘటనలు కనిపిస్తున్నవి. ఎవరు ఎవరికి కంటకుడు? యుద్ధంలో ఏ పక్షానిది న్యాయమో ఎవరు తేల్చాలి? రాసిన పురాణాలైనా, చరిత్రలైనా విజేతల కథనాలే కదా. ద్వేషంతో ఎవరినైనా, దేన్నైనా గెలవాలని ప్రయత్నించినప్పుడల్లా, ద్వేషమే గెలుస్తుందన్న నానుడి ఉన్నది. అదే సమయంలో న్యాయమైన ఆగ్రహాన్ని, పది మంది మీద ప్రేమతో పుట్టే ప్రతిఘటనను కూడా బలప్రయోగంతో అణచివేయలేరని రాజకీయ విశ్లేషకుల మాట. మావోయిస్టులు పూర్తిగా అంతరించిపోయినా మరో రూపంలో ఆ ఉద్యమం మరలా పురుడుపోసుకోదన్న హామీ ఏమీ లేదు.

ఎస్.కె. జకీర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News