ఇబ్బడిముబ్బడిగా జిఎస్‌టి వసూళ్లు
ఈ ఆగస్టులో రూ.1.43లక్షల కోట్లకు చేరిక
నిరుటి కంటే 28% ఎక్కువ
అయినా రాష్ట్రాల వాటా పెంచని కేంద్రం
48శాతానికి పెంచాలని రాష్ట్రాల డిమాండ్
రాష్ట్రాల విన్నపాల మళ్లీ బుట్టదాఖలేనా?
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు అన్ని రకాల జిఎస్‌టి వసూళ్ళ రూపంలో రూ. 1,43, 612 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఆగస్టు నెల కంటే ఈ ఏడాది ఆగస్టు నెలలో పన్నుల ఆదాయంలో ఏకంగా 28 శాతం (సెస్ ఆదాయం కలుపుకొని) వృద్ధిరేటు కనిపించింది. సగటున ప్రతి ఏటా 20 శాతం మేరకు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతూనే ఉందని అధికారవర్గాలు తెలిపాయి. సెంట్రల్ జిఎస్‌టి రూపంలో 24,710 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. రాష్ట్రాల జిఎస్‌టి వసూళ్ళు 30, 951 కోట్ల రూపాయలు వసూలు కాగా, ఇంటిగ్రేటెట్ జిఎస్ టి కేటగిరీ కింద 77,782 కోట్ల రూపాయలు వసూలు కాగా సెస్ రూపంలో మరో 10,168 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. ఇలా కేంద్ర ప్రభుత్వ ఖజానా పరిస్థితి “మూడు పువ్వులు-ఆరు కాయలు” అన్నట్లుగా వసూళ్ళ పర్వం కొనసాగుతోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆగస్టు నెలలో జి.ఎస్.టి. రూపం లో 3,871 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ఖజానా కు వెళ్ళాయి. 2021 ఆగస్టు నెలలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటినీ కలిపితే 1,12,020 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే ఏడాది తర్వాత 2022 ఆగస్టు నెలలో 1,43,612 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గత ఏడాది ఆగస్టు కంటే ఈ ఏడాది ఆగస్టు నెలకు 28 శాతం జిఎస్‌టి వసూళ్ళు పెరిగాయి. పన్నుల వసూళ్ళలో రికార్డుల న్నీ బద్దలు కొడుతూ ఖజానాకు లక్షల కోట్ల రూపాయల నిధులను రాబట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వాటా నిధులను మాత్రం పెంచడంలేదని అధికారవర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. పన్నుల ఆదాయం రాష్ట్రాల వాటాను 41 శాతం నుంచి 45 శాతం వరకూ పెంచాలని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలూ అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూనే వస్తున్నాయని, కానీ కేంద్రం రాష్ట్రాల విన్నపాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాల మెరుగైన పరిపాలనా పద్దతులు, జి.ఎస్.టి. వసూళ్లల్లో రాష్ట్రాలు ఎంతో సమర్ధవంతంగా పనిచేయడం మూలంగానే కేంద్రానికి భారీగా ఆదాయం వస్తోందని, కేంద్ర ఖజానాకు వస్తున్న ఆదాయంలో రాష్ట్రాల కష్టమే ఎక్కువగా ఉందని, ఈ క్రెడిట్ రాష్ట్రాలకే దక్కుతుందిగానీ కేంద్రానికి కాదని అంటున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, అండమాన్, నికోబార్ దీవులు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటినీ కలిపితే గత ఏడాది ఆగస్టులో 214 కోట్ల ఆదాయం వచ్చిందని, అదే ఈ ఏడాది ఆగస్టులో 205 కోట్ల రూపాయలకు పడిపోయిందని, దాంతో గత ఏడాది కంటే ఈ ఏడాది ఆదాయం 4 శాతం తగ్గిందని కేంద్ర ఆర్ధికశాఖ రికార్డులే స్పష్టంచేస్తున్నాయని ఆ అధికారులు వివరించారు. అండమాన్, నికోబార్ దీవుల నుంచి గత ఏడాది ఆగస్టులో 20 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది ఆగస్టు నెలలో కేవలం 16 కోట్లే వచ్చింది. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది ఆగస్టులో 21 శాతం తగ్గింది. అదే విధంగా లక్షదీవుల్లో నైతే మరీ దారుణం గత ఏడాది ఆగస్టులో ఒక కోటి రూపాయలు ఆదాయం రాగా ఈ ఏడాది ఆగస్టులో ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదని, జీరో ఆదాయమని కేంద్ర ఆర్ధికశాఖ రికార్డులు వెల్లడించాయని ఆ అధికారులు వివరించారు. ఇలా కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రాంతాల్లో పన్నుల ఆదాయం ఘోరంగా ఉందని, బిజేపీయేతర రాష్ట్రాల్లోనే పన్నుల ఆదాయం భారీగా ఉందని వివరించారు. తెలంగాణతో పాటుగా మిగతా రాష్ట్రాల్లో జి.ఎస్.టి. వసూళ్ళకు ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయని, పన్నుల వసూళ్ళ విభాగాల్లో ఎలాంటి లొసుగులు లేకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పన్నుల విభాగాలు పనిచేస్తుండటంతోనే ఎక్కడా లోపాలు లేకుండా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వీలయ్యిందని, కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే పన్నుల ఆదాయం ఘోరంగా పడిపోయిందని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్రాలపైనే కేంద్రం ఆధారపడి బ్రతుకుతుందేగానీ, కేంద్రంపైన రాష్ట్రాలు ఆధారపడిలేవని స్పష్టమయ్యిందని, ఈ విషయాలను ప్రతి ఒక్కరూ అర్ధంచేసుకోవాలని ఆ అధికారులు కోరుతున్నారు. ఈ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఇప్పటికైనా రాష్ట్రాల అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకొని పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాలను 41 శాతం నుంచి 45 శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నారు. రాష్ట్రాల అభ్యర్ధనలను కేంద్రం పట్టించుకుంటుందో…లేదో… వేచిచూడాలి.
Centre Govt Over 1. lakh crore received by GST