జనగామ: కేంద్రం చేనేతలపై జిఎస్టిని వెంటనే తొలగించాలని, ఇటీవల కేంద్రం పెంచిన జీ ఎస్టీతో సామాన్య ప్రజలతో పాటు, రెక్కాడితే డొక్కాడని చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో చేనేత కార్మికులు నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ ర్యాలీలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని కేంద్ర వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ”తెలంగాణ చేనేత కుటుంబాలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సమాజానికి సంస్కృతిని నేర్పిన నేర్పరులు చేనేతలు. చేనేత హస్త కళ, అద్భుత కళ, అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన గొప్ప కళాకారులు చేనేతలు. జాతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో చేనేతల పాత్ర ఎంతో ఉంది. దేశ ప్రజలను ఐక్యం చేసిన అంశాల్లో చేనేతలే కీలకం. విదేశీ వస్త్ర బహిష్కరణ కు పిలుపునిచ్చిన గాంధీజీ, స్వదేశీ వస్త్రాలను మాత్రమే వాడాలని చెప్పారు. స్వయంగా గాంధీజీ నూలు వడికి, చేనేతలకు చేయూతగా నిలిచారు.
వరంగల్ జిల్లా కూడా చేనేతలకు ప్రసిద్ధి. స్వాతంత్ర్యానికి పూర్వమే నిజాం కాలంలోనే వరంగల్ లో అజాం జాహి మిల్లు 10 వేల మంది కార్మికులకు ఉపాధిని ఇచ్చింది. 7వ నిజాం తన పెద్ద కొడుకు అజమ్ జా పేరున ఆ మిల్లు పెట్టాడు. ఒకప్పుడు చేనేతలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేవి. క్రమేణా యంత్రాలు వచ్చాయి. చేనేతల కార్మికులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు దాపురించాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసిఆర్ చేనేతలను ఆదుకోవడానికి అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. సిరిసిల్ల అంటే… ఉరి సిల్ల అని ఒకప్పుడు తాటికాయంత అక్షరాలతో మీడియా రాసేది. మంత్రి కెటిఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యే అయ్యాక సిరి సిల్ల సిరుల ఖిల్లాగా మారింది.
తెలంగాణను చూసి కేంద్రం తెలివి తెచ్చుకోవాలి, సీఎం కెసిఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా సమగ్రంగా చేనేతల కార్మికులను అభివృద్ధి పరిచేవిధంగా అనేక పథకాలను అమలు చేస్తున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు. బీమా చేశారు. రైతు బీమా లాగానే, చేనేత కార్మికులు ఏ కారణం చేత మరణించినప్పటికీ వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు వారికి అందే విధంగా ఏర్పాటు చేశారు. చేనేతల ఆదుకోవడానికి రాష్ట్రం తరహా సమగ్ర అభివృద్ధి పథకాలను అమలు చేయాలి. మానవాళికి సంస్కృతిని నేర్పిన చేనేతలను విస్మరిస్తే చరిత్ర క్షమించదు” అని అన్నారు.
Centre Govt should remove GST on Handlooms: Errabelli