చట్టాలను రద్దు చేయాల్సిందే : రైతు నేతలు
అవిచేసే మంచిని చూడండి : కేంద్రం
గంటలోనే ముగిసిన ఏడో దఫా చర్చలు
8వ తేదీకి వాయిదా, వచ్చే దఫా చర్చలపై ఆశతో ఉన్నాం : మంత్రి తోమర్
ప్రభుత్వ అహంకారమే సమస్య: రైతు సంఘాలు
న్యూఢిలీ: కేంద్రం రైతుల మధ్య ఏడవ దఫా చర్చలు ఎటూ తేలకుండానే 8వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం జరిగిన ఇరుపక్షాల సంప్రదింపుల పర్వం అసంపూర్తిగా ముగిసింది. పలు రైతు సంఘాల నేతలు, కేంద్ర మంత్రుల మధ్య ఏడవ దఫా చర్చలు ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని, దీనిపై వెనకకు పొయ్యేది లేదని రైతులు స్పష్టం చేశారు. అయితే చట్టాల వల్ల కలిగే పలు ప్రయోజనాలను ఒక్కసా రి పరిశీలించాలని చర్చల దశలో మంత్రుల బృం దం ఏకరువు పెట్టింది. దేశ వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా కొత్త చట్టాలను తీసుకువచ్చామని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో తాము తీసుకువచ్చిన చట్టాలను వెనకకు తీసుకోవడం కుదరదని పరోక్షంగా స్పష్టం చేసింది. దీనితో సోమవారం నాటి చర్చలు కూడా ఇంతకు ముందటిలాగానే ప్రతిష్టంభన నడుమనే ముగిశాయి. 8వ దఫా చర్చలకు రంగం సిద్ధం అవుతోంది.
8వ దఫా చర్చలపై ఆశతో: మంత్రి తోమర్
ఈ నెల 8న తిరిగి చర్చలు ఉంటాయని తరువాత వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. ఈ దఫా చర్చలలో సరైన పరిష్కారం ఉంటుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా పరిష్కారం దక్కాలంటే ఇరుపక్షాల నుంచి తగు స్పందన అవసరం అన్నారు. ఈ దశలోనే మంత్రి హిందీలో తాలి దోనో హాతోంసే బజ్తి హై ( రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు) అని వ్యాఖ్యానించారు. ఇప్పటి చర్చలలో ఎటువంటి ఫలితం రాలేదన్నారు. రైతు నేతలు కేవలం చట్టాల ఉపసంహరణపైనే పట్టుపడుతున్నారని తెలిపారు. ఇది ఓ విధంగా మంకుపట్టు అవుతోందన్నారు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని విషయాలక సంబంధించి సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నామని, చట్టాలపై అంశాల వారి సమీక్షకు కూడా సిద్ధపడటం వల్ల చర్చల పురోగతికి వీలేర్పడుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఇరు పక్షాల మధ్య విశ్వాస లోపంతోనే ప్రస్తుత ప్రతిష్టంభన కొనసాగుతోందా? అనే ప్రశ్నకు తోమర్ స్పందిస్తూ, ప్రభుత్వంపై నమ్మకం లేకుంటే రైతు నేతలు చర్చకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. మరో దఫా చర్చలు కూడా మరో తేదీ ఖరారుతో ముగుస్తాయా? అనే ప్రశ్నకు జవాబిస్తూ ఎవరైనా ఏదైనా అనుకునే స్వేచ్ఛ ఉందని, అయితే తాను చెప్పేది ఒక్కటే అని, వారు తామూ చర్చలు సాగిస్తూ ఉండటమే ఏదో ఒక పరిష్కారం పట్ల ఆశాభావంతోనే అన్నారు. ఇదే విధమైన సవ్య ఆలోచనతోనే తాను ఉన్నానని తెలిపారు. దేశంలోని అందరి రైతుల సంక్షేమమే కేంద్రం లక్షం అని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే అన్ని రైతు సంఘాలు, ప్రతినిధులతో మాట్లాడుతామని తెలిపారు. సోమవారం నాటి సంప్రదింపులలో కేంద్రం తరఫున తోమర్‌తో పాటు రైల్వే , వాణిజ్య, ఆహార విషయాల మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ కూడా ఇంతకు ముందటిలాగానే ముగ్గురు మంత్రుల బృందంగా పాల్గొన్నారు.
సర్కారు వారి అహం సమస్య: రైతు సంఘాలు
ప్రస్తుత సంక్షోభ దశకు ప్రభుత్వ వైఖరి కారణం అని రైతు నేతలు విమర్శించారు. ప్రభుత్వం ఎంతసేపూ తమ ఆధిపత్యం నెగ్గించుకోవాలనే తపనతో ఉందని, ఇది వారి పక్షాన ఉన్న అహం సంబంధిత జటిల అంశం అన్నారు. మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని, దీనిపై వెనకకు వెళ్లేది ఉండదని తేల్చిచెప్పారు, ఇక ఇంతకు ముందు చెప్పినట్లుగానే కనీస మద్దతుధరలపై చట్టబద్ధమైన గ్యారంటీని కోరుతున్నామన్నారు. చర్చల ఆరంభం నుంచి కూడా రైతు నేతలు ముందు చట్టాలను వెనకకు తీసుకోండని చెపుతూ వచ్చినట్లు తెలిసింది. ఇప్పటి చర్చలు కేవలం గంటసేపే జరిగాయి. తిరిగి 8న కలుద్దాం అనుకుంటూ ముగిశాయి. చర్చల దశలో రైతు నేతలు కొద్ది సేపు సామూహిక భోజనశాల నుంచి వచ్చిన ఆహారం తీసుకున్నారు. ఇంతకు ముందటి దఫా చర్చల దశలో మాదిరిగా ఈసారి మంత్రులు రైతు నేతలతో కలిసి లంగర్ భోజనం తీసుకోలేదు. రైతులు మధ్యాహ్న భోజనానికి వెళ్లినప్పుడు మంత్రులు ముగ్గురు తమలో తాము చర్చించుకుంటూ గడిపారు. సాయంత్రం తిరిగి ఇరుపక్షాలూ చర్చకు కూర్చున్నాయి. అయితే చట్టాల రద్దు కుదరదు మధ్యనే సాగడంతో ప్రతిష్టంభన ఏర్పడిందని వెల్లడైంది. మంగళవారం రైతు నేతలు తిరిగి తమలో తాము సమావేశం అవుతారు. తదుపరి కార్యాచరణను ఖరారు చేసుకుంటారు. సోమవారం నాటి చర్చలలో కనీస మద్దతు ధరలపై చట్టబద్ధ హామీకి సంబంధించి ప్రస్తావనకే రాలేదు. చట్టాల రద్దు కీలకమని, ఇతరత్రా దేనికి అంగీకరించేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ (రాజేవాల్) అధ్యక్షులు బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. తాము కోరుతున్నది కాకుండా ఇతర అంశాలను మంత్రులు ప్రస్తావిస్తున్నారని అన్నారు. మంత్రుల వైఖరితోనే చర్చలు ముందుకు సాగడం లేదన్నారు. మహిళా కిసాన్ అధికారి మంచ్ నాయకురాలు కవిత కురున్గటి స్పందిస్తూ చట్టాలతో రైతులకు లాభం ఉంటుందని ప్రభుత్వం చెపుతూ రావడం వల్లనే ప్రతిష్టంభన నెలకొందన్నారు. మంత్రులు వారిలో వారు చర్చించుకుని తిరిగి చర్చలకు వస్తామని చెప్పారని వివరించారు.
Centre Govt Talks With Farmers Fail Again