Thursday, December 26, 2024

మరోసారి మద్దతు మోసకారితనం!

- Advertisement -
- Advertisement -

మోడీ ప్రభుత్వం మరోసారి మద్దతు ధరల మాయాజాలానికి తెరలేపింది. 2023 -24 సంవత్సరానికి 23 పంటలకు మద్దతు ధరలను ప్రకటించింది. చెప్పిన మాట ప్రకారం సేద్యపు ఖర్చులపై అదనంగా 50% పెంచి మద్దతు ధర ప్రకటించినట్లు వంచన మాటలు చెబుతున్నది.ఫలితంగా ఈ మద్దతు ధరలతో రైతాంగం నష్టపోవటం, అప్పులపాలై సంక్షోభంలో కొట్టుమిట్టాడటం, ఆత్మహత్యల పరంపర కొనసాగడం ఎక్కువ అవుతుందే గాని తగ్గదు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ విభాగం కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటిస్తుంది. దేశ వ్యాప్తంగా వ్యవసాయ ఖర్చులను తీసుకుని వాటి సరాసరి లెక్కించి కేంద్రానికి ధరల సిఫార్సులు నివేదిస్తుంది. తక్కువ పంట ఖర్చులను పరిగణనలోకి తీసుకని ధరలను సిఫార్సులు చేయడంగానే ఉంటుంది. కనీసం ఈ సిఫార్సులను గాని, రాష్ట్రాలు పంపే సిఫార్సులను గాని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా, ఇష్టాను సారంగా మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది.

మద్దతు ధరలకు గీటురాయిగా కేంద్రం తీసుకుంటున్న పంట ఖర్చులకు, వాస్తవ ఖర్చులకు చాలా వ్యత్యాసం ఉంది. ఎ2 విధానం ప్రకారం విత్తనాలు ఎరువులు, పురుగు మందులు, కూలి, లీజుకి తీసుకునే భూమి, ఇంధనం, నీటి పారుదల ఖర్చు లు, పంట ఖర్చులుగా పరిగణింపబడతుంది. ఎ2 + ఎఫ్‌ఎల్‌లో, ఎ2లో చేర్చని కుటుంబ ఖర్చు కూడా కలిగి ఉంటుంది. సి2 పద్ధతి అనేది ఎ2+ఎఫ్‌ఎల్‌పై అద్దెలు, యాజమాన్యంలోని భూమి పై, స్థిర మూలధనంపై వడ్డీ కూడా కలిపి మద్దతు ధర నిర్ణయించటం. మోడీ ప్రభుత్వం ఎ2 ఖర్చులలో భూమి అద్దె మినహాయించి మిగతావి పంట ఖర్చులుగా తీసుకుని మద్దతు ధరలను ప్రకటిస్తున్నది. ఎకరా వరి సేద్యపు ఖర్చు దాదాపు 35 వేలు. దీనిసగటు దిగుబడి 22 క్వింటాళ్లు. క్వింటా ఉత్పత్తి ఖర్చు రూ. 1,600. దీనిపై 50% అదనంగా పెంచి మద్దతు ధర ప్రకటిస్తే రూ. 2400గా ఉండాలి. ప్రభుత్వం మాత్రం క్వింటా మేలు రకం వరికి ఉత్పత్తి ఖర్చు 1470 రూపాయలగా నిర్ణయించి దానిపై 50% పెంచి మేలు రకం ధాన్యానికి రూ. 2203 నిర్ణయించింది.

సాధారణ రకానికి రూ.2183 మద్దతు ధర ప్రకటించింది. ఎ2+ ఎఫ్‌ఎల్ ప్రకారం ఎ2 లో కలపని కౌలు ఖర్చు రూ. 15 వేలు కలిపితే ఎకరా వరి పంట ఖర్చు రూ.50వేలు. క్వింటా వరి ఉత్పత్తి ఖర్చు రూ.2272. దానిపై 50% పెంచితే రూ. 3336 మద్దతు ధర ప్రకటించాలి. సి2 ప్రకారం ఎ2+ఎఫ్‌ఎల్‌లో కలపని అద్దెలు, అప్పులపై వడ్డీలను పంట ఖర్చులో అదనంగా ఉంటుం ది. ఈ వడ్డీ రూ. 8 వేల దాకా ఉంటుంది. దీని ప్రకారం ఉత్పత్తి ఖర్చు 58 వేలు. దాని ప్రకారం క్వింటా ఉత్పత్తి ఖర్చు రూ. 2636. దానిపై 50 శాతం కలిపితే రూ. 3954 మద్దతు ధర ఉండాలి. తెలంగాణలో ఎకరా పత్తి పంట సాగు వ్యయం 40 వేలు కాగా, సగటు దిగుబడి ఏడు క్వింటాళ్లు. క్వింటా ఉత్పత్తి ఖర్చు రూ. 5,900. దీనిపై 50 శాతం పెంచితే రూ. 7,950 మద్దతు ధర ఉండాలి. కౌలు చెల్లింపు రూ. 12 వేలు కలిపితే, వడ్డీ రూ. 5 వేలు కలిపితే సేద్యపు ఖర్చు రూ. 53,400 గా ఉంది. దీని ప్రకారం క్వింటా ఉత్పత్తి ఖర్చు రూ. 7628. దీనికి 50% కలిపితే 11,442 రూపాయలు మద్దతు ధరగా ఉండాలి.మోడీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొడవు పింజ పత్తికి రూ. 7020, మీడియం పత్తికి రూ. 6,620. మిగతా పంటలకు కూడా ఈ విధంగానే కేంద్రం మద్దతు ధరలు ప్రకటించటం జరిగింది.

ఈ వాస్తవాన్ని గమనిస్తే సేద్యానికి వాస్తవంగా రైతాంగం పెట్టే పెట్టుబడికి, ప్రభుత్వం నిర్ణయించిన పెట్టుబడికి చాలా ఎక్కువ తేడా ఉన్న వాస్తవాన్ని గమనిస్తే మోడీ ప్రభుత్వ మద్దతు ధర మోసం వలన రైతాంగం ఎంతగా నష్టపోతుందీ అర్ధమవుతుంది.
దళారుల దోపిడీ నుంచి రైతాంగాన్ని విముక్తి చేసేందుకు 1966-67 వార్షిక సంవత్సరంలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తున్నట్లు చెప్పింది. వాస్తవ పంట వ్యయానికి అనుగుణంగా ఎప్పుడు ఏ ప్రభుత్వం మద్దతు ధరలను ప్రకటించలేదు. అందువలన అవి రైతాంగ ప్రయోజనాలను కాపాడలేకపోయాయి. ఏ పార్టీ ప్రభుత్వం కూడా తాము ప్రకటించే మద్దతు ధరలకు చట్టబద్ధ్దత కల్పించడం గాని, పంటల కొనుగోళ్ళకు బాధ్యత వహించటం గాని చేయలేదు. మార్కెట్‌లో మద్దతు కన్నా పంటల ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వమే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) ద్వారా పంటలు కొనుగోలు చేయిస్తానని చెప్పినా ఆచరణలో ఉద్దేశపూరితంగా విఫలమయ్యాయి. ఎఫ్‌సిఐ నామమాత్రపు కొనుగోళ్ళకే పరిమితమైంది. పంటల అమ్మకాలకు ప్రైవేట్ వ్యాపారులే రైతులకు శరణ్యమయ్యారు. తమ ఇష్టమైన ధరలకు వ్యాపారులు కొనడం వలన రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. మోడీ ప్రభుత్వం పంటల కొనుగోళ్ళకు తిలోదకాలు ఇచ్చింది. ఎఫ్‌సిఐ ధాన్యం కొనుగోళ్ళ నుంచి తప్పుకుంది.

ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైన బియ్యాన్ని మిల్లుల నుండి తీసుకుంటున్నది. పంటల కొనుగోళ్ళ నుంచి వైదొలగడానికి రైతాంగ ప్రయోజనాలను దెబ్బ తీసే మూడు వ్యవసాయ చట్టాలను చేసి, తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిని ఉపసంహరించుకొన్నట్లు ప్రకటన చేయక తప్పలేదు. మద్దతు ధరలకు చట్టబద్ధత గురించి పరిశీలించేందుకు కమిటీ వేస్తానని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. పరోక్షంగా మూడు వ్యవసాయ చట్టాలను అమలు చేస్తున్నది.
ప్రతి సంవత్సరం పంట ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. 1956 లో ఎకరా పంట ఖర్చు రూ. 152. నేడు 35 వేల రూపాయలు. 1956 దిగుబడి తక్కువగా ఉన్నా రైతాంగం జీవనం సాఫీగానే సాగింది. ఇప్పుడు దిగుబడులు బాగా పెరిగినా, రైతాంగ జీవితం కల్లోలభరితంగా మారింది. అందుకు కారణం పంట ఖర్చులు పెరగడం, న్యాయమైన ధరలులభించక, సేద్యం గిట్టుబాటుకాక రైతాంగం అప్పుల్లో కూరుకుపోతున్నారు. మోడీ నాయకత్వాన ఎన్‌డిఎ కూటమి మొదటసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి అందుకు విరుద్ధంగా రైతాంగ వ్యతిరేక విధానాలు అమలు జరుపుతున్నది.

ఫలితంగా వ్యవసాయం నష్టంగా మారి రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇదే మోడీ ప్రభుత్వం 2022 నాటికి రైతులకు ఇచ్చిన ‘కానుక’. దేశ వ్యాప్తంగా ప్రతి రైతుపైన దాదాపు లక్ష రూపాయల అప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్ తలసరి రైతాంగం అప్పు రూ. 2,45,554 ఉన్నట్లు పార్లమెంట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. తెలంగాణలో రైతాంగ తలసరి అప్పు రూ. 1,52,121. ఆ తర్వాత స్థానం పంజాబ్ ది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో రైతుల తలసరి అప్పు లక్షకు పైగా ఉంది. ఈ అప్పులు తీర్చడానికి ఉన్న కొద్ది పాటి సేద్యపు భూమి, ఇతర ఆస్తులు అమ్మినా అప్పులు తీరక, బ్యాంక్ అధికారులు, వడ్డీ వ్యాపారులు పెట్టే వేధింపులు, అవమానాలు భరించలేక, అప్పులు తీర్చేమార్గం కానరాక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత 18 సంవత్సరాల కాలంలో 3 లక్షల 50 వేల మంది రైతులు బలవన్మరణాల పాలయ్యారు. 1995- 2014 మధ్య 2,96,438 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2018- 20 సంవత్సరాల మధ్య 17 వేల మంది రైతులు ఆత్మహత్యలకు గురయ్యారు.

దేశంలో రోజూ 30 మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. 26 కోట్ల మంది వ్యవసాయ కూలీలు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. దేశంలో సరళీకరణ ఆర్థిక విధానాల అమలు, ప్రపంచ వాణిజ్య ఒప్పం దం, వ్యవసాయ ఒప్పందాలను ఆమోదించడం తో దేశీయ వ్యవసాయ రంగంలోకి సామ్రాజ్యవాదులు ముఖ్యం గా అమెరికా, దాని అనుంగ సంస్థలు ప్రవేశించడానికి భారత పాలకులు దేశ తలుపులు బార్లా తెరిచారు. వాటి విత్తనాలు, ఎరువులు, తెగుళ్లు దేశంలోకి దిగుమతి కావడం, తెగుళ్ల నివారణకు ఆ సంస్థల పురుగు మందుల విక్రయాలు విపరీతంగా పెరగడం తో రైతాంగానికి వ్యవసాయం మోయలేని భారంగా తయారైంది.
మన వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి ఆహార ధాన్యాలకు తనపై భారతదేశం ఆధారపడేలా చేసుకునేందుకు, ప్రపంచ మార్కెట్‌లో దాని ఆహార ఉత్పత్తులు చవకగా లభ్యమయ్యేలా చేస్తున్నది. అందుకు భూఎస్టేట్‌దారులకు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందిస్తున్నది.ఒక్కో భూఎస్టేట్‌దారుకు ఏటా లక్షల దాకా సబ్సిడీ అందిస్తున్నది. చిన్న రైతులకు మాత్రం నామమాత్రపు సబ్సిడీనే లభిస్తున్నది.

యూరోపియన్ యూనియన్ ఉమ్మడి బడ్జెట్‌లో 40% వ్యవసాయ సబ్సిడీలకు కేటాయిస్తున్నది.భారత రైతాంగానికి ప్రభుత్వం ఇస్తున్న సబ్బిడీ రూ. 16 వేలు మాత్రమే. ఈ నామమాత్రపు సబ్సిడీని కూడా ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు తగ్గిస్తూ వస్తున్నది. మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగా మార్చి చిన్న, సన్నకారు రైతులను సేద్యం నుంచి వైదొలిగేలా చేసి వారి భూములను కార్పొరేట్ సంస్థలకు, కాంట్రాక్ట్ సేద్యానికి అప్పగించ చూస్తున్నది. అందులో భాగమే మూడు వ్యవసాయ చట్టాలు, రైతాంగానికి ఉపయోగం లేని పంటల మద్దతు ధరలు. మోడీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, పంటలకు న్యాయమైన మద్దతు ధరలు ప్రకటించాలని, భూములను కార్పొరేట్ల పరం చేయరాదని యావన్మంది రైతాంగం ఉద్యమించాలి.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News