లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి)కు మరిన్ని అధికారాలు కల్పించే బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఢిల్లీలోని ప్రతిపక్ష ఆమ్ ఆద్మీపార్టీ అధికారాలకు కత్తెర విధించేలా రూపొందించిన ఈ బిల్లు వివాదాస్పద బిల్లు అవుతోంది. ఢిల్లీ రోజువారి అధికారిక నిర్వహణ విషయంలో ఎల్‌జికి విశేషాధికారాల దిశలో ఈ బిల్లు ఉంది. పలు అంశాలపై కేంద్రం ఆప్ ప్రభుత్వానికి మధ్య ఉన్న చిచ్చు ఈ బిల్లుతో తిరిగి రాజుకుంటుందని భావిస్తున్నారు. జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ చట్టం 2021గా ఈ బిల్లును తీసుకువచ్చారు. ఢిల్లీ నగరానికి సంబంధించి ఎటువంటి కార్యానిర్వాహక చర్యల నిర్ణయాలకు దిగినా ఢిల్లీ ప్రభుత్వం ముందు లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయం తీసుకోవల్సి ఉంటుంది.
తీసుకువచ్చే అన్ని చట్టాలకు సంబంధించి ఢిల్లీలోని ప్రభుత్వం ఖచ్చితంగా సంబంధిత లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం అయినందున , సంబంధిత అంశాలకు అనుగుణంగా సంబంధిత లెజిస్లేటివ్ నిబంధనలలో నిర్థిష్టత కోసం ఈ బిల్లును తీసుకువచ్చినట్లు హోం మంత్రిత్వశాఖ తెలిపింది. బిల్లు ఆమోదం పొందితే ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వం రోజు వారి పరిపాలనా సంబంధిత నిర్ణయాలు ఏమీ కూడా తీసుకోవడానికి వీల్లేదు. పరిపాలనా సంబంధిత వ్యవహారాలపై ప్రభుత్వం ఎటువంటి దర్యాప్తులకు ఆదేశించరాదు. ఇటువంటివి జరిగితే చట్టం రూపొందిన తరువాత అవి చెల్లకుండా పోతాయని బిల్లులో తెలిపారు.