రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ, తదితర రాష్ట్రాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోంది. కేంద్రం మూడొంతుల ఆదాయాన్ని తీసుకుంటూ, ఖర్చుల భారాన్ని మాత్రం రాష్ట్రాల మీదే మోపుతుంది. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తూ పేద ప్రజల మీద అధిక భారం మోపుతోంది. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కూడా ప్రశ్నించడం బిజెపికే చెల్లింది. తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజల సాక్షిగా కేంద్రం దృష్టికి తేవడంతో పాటు, ఎంత ప్రశ్నించినా మీ తెలంగాణ వ్యతిరేక వైఖరిలో మార్పురాదని తెలంగాణ సమాజం బలంగా విశ్వసిస్తున్నది. గుజరాత్‌పై వల్లమాలిన ప్రేమను, తెలంగాణపై అదే సవతి తల్లి ప్రేమను ఇలాగే కొనసాగిస్తే బిజెపి తెలంగాణ ప్రజాక్షేత్రంలో అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. విభజన చట్టంలో తెలంగాణకు కొన్ని నిర్దిష్టమైన హామీలను పార్లమెంట్ సాక్షిగా భారత ప్రభుత్వం ఇచ్చింది. ప్రతిపక్షంలో వున్నప్పుడు తెలంగాణ అంటే ప్రేమ ఉన్నట్టు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చేందుకు చేసిన ప్రయత్నం ఏంటి? విభజన చట్టంలో చెప్పిన ఏ ఒక్క హామీ అయినా బిజెపి ప్రభుత్వం నెరవేర్చిందా?
1. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల డిమాండ్. ఇదే విషయాన్ని ఎన్నో సార్లు తెలంగాణ ప్రభుత్వం అడిగితే దేశంలో కోచ్ ఫ్యాక్టరీలకు డిమాండ్ లేదని ప్రభుత్వం చేతులు దులుపుకున్నది వాస్తవం కాదా? 2. కాని నిన్న మొన్ననే రూ. 20 వేల కోట్లతో గుజరాత్‌లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం తెలంగాణపై మీకున్న చిన్నచూపుకు నిదర్శనం కాదా? గుజరాత్‌కు కోచ్ ఫ్యాక్టరీ ఎలా వస్తుంది?
3. తెలంగాణకు ఎన్‌డిఎ ఆధ్వర్యంలోని కేంద్రం ఇచ్చిన ఒక్క విద్యా సంస్థ పేరైనా చెప్పగలరా? ఐఐఎం, ఐఐఐటి, గిరిజన విశ్వవిద్యాలయం, నవోదయ విద్యాలయాల్లో ఏ ఒక్కటీ తెలంగాణకు ఎందుకు కేటాయించలేదో సమాధానం చెప్పగలరా తెలంగాణ ప్రజలకు.
4. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయలేదు. ఫలితంగా లక్షలాది తెలంగాణ బిడ్డలు మెడిసిన్ చదువుకోలేకపోతున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాకు 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పాలనా తెలంగాణలో కొనసాగుతున్నది.
5. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీని ఏర్పాటు చేయాలి. తెలంగాణ బాగుపడితే చూడలేని కక్షపూరిత వైఖరితో న్యాయంగా దక్కిన ఆ హామీని ఎందుకు తుప్పు పట్టించారు? కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలుస్తున్నది. అయితే విభజన చట్టంలో ఉన్న పారిశ్రామిక రాయితీలను తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు?
6. ఐటి రంగంలో హైదరాబాద్ సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలన్న బిజెపి ప్రభుత్వ కుట్రలకు ఐటిఐఆర్ రద్దు పరాకాష్ఠ కాదా? ఐటిఐఆర్‌ను రద్దు చేసి, అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఐటి అభివృద్ధి కోసం చేపట్టిన ఒక్క కార్యక్రమాన్ని అయినా చెప్పగలరా? ఐటిఐఅర్ రద్దుతో ఇక్కడి యువతకు దక్కకుండా పోయిన ఉద్యోగాలపై ఏం సమాధానం చెబుతారు?
7. ఐటి రంగంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో దాని అభివృద్ధి కోసం సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పారక్స్ ఎందుకు ఇవ్వడంలేదు? పాలమూరు, రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014 ఎన్నికల సభలో సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. కాని అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు గడిచినా మీరు ఇచ్చిన హామీనే ఎందుకు అమలు చేయలేదు?
8. తెలంగాణకు దక్కాల్సిన 575 టియంసిల సాగు నీటి వాటాల కేటాయింపులపై తెలంగాణ కోరుతున్న విధంగా బ్రిజేష్ కూమార్ ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయకుండా 8 ఏళ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారు? కృష్టా నది యాజమాన్య బోర్డు అనే ఒక శిఖండి సంస్ధను ఏర్పాటు చేసి తెలంగాణకు సాగునీటి జలాల హక్కులు దక్కకుండా తాత్సారం చేస్తున్న వివక్షపూరిత తీరుపై ఏం చెప్తారు?
9. పక్కనున్న కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తానని ప్రకటించడం తెలంగాణ రైతాంగం పట్ల బిజెపి ప్రభుత్వ వైఖరికి నిదర్శనం కాదా?
10. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నిధులు కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి చేసిన సహాయం ఏమిటో సమాధానం చెప్పాలి? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి దేశ చరిత్రలో ఎన్నడూ ఎరుగని విప్లవాత్మక ప్రాజెక్టులకు రూ. 24 వేల కోట్లు గ్రాంట్ ఇయ్యమంటూ సాక్షాత్తూ నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఇప్పటిదాకా పైసా విదల్చని వైఖరిపై ఏం చెప్తారు?
11. స్కైవే ల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు అడిగితే ఏడేళ్లుగా తొక్కిపడుతూ నగర పౌరులను అవస్ధలకు గురి చేస్తున్నది నిజం కాదా? దేశంలో బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని నదీ ప్రక్షాళన ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించుకుంటూ, మూసీ ప్రక్షాళన, అభివృద్ధికి మూడు పైసలు కూడా కేటాయించనిది నిజం కాదా? 12. హైదరాబాద్‌లో చరిత్రలో ఎన్నడూ ఎరగని వరదల్లో మునిగితే గుజరాత్‌కు వేల కోట్ల వరద సాయం అందించి, హైదరాబాద్‌కు మొండి చేయి చూపించ లేదా?
13. కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచానికి ఫార్మా రంగం బలంలో అండగా నిలిచి, వ్యాక్సిన్ల తయారీతో భారత దేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన హైదరాబాద్ ఫార్మా రంగానికి ఎందుకు సహాయం అందించడం లేదు?
14. ఈకో సిస్టం దిక్కులేని చోటకు డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్ తరలించి, అగ్రగామి ఎరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయడం లేదు? దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్ పార్కు కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్ర టెక్స్‌టైల్ రంగానికి చేయూత ఇయ్యకుండా, ఒక్క మెగా పవర్ లూం టెక్స్‌టైల్ క్లస్టర్ కూడా ఇవ్వకుండా శీతకన్ను వేసింది నిజం కాదా?
15. తెలంగాణ రైతులు తమ ధాన్యాన్ని పంజాబ్‌లో మాదిరి కొనుగోలు చేయాలని, ఢిల్లీ వేదికగా కోరినా ఎందుకు కొనుగోలు చేయడం లేదు? నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఇవ్వాల్సిన పసుపు బోర్డు ఎందుకిస్తాలేరో చెప్పగలరా?
16. దేశ ప్రజల నడ్డి విరిచేలా పెంచుతున్న పెట్రో ధరలపైన అసలు కారణమైన సెస్సులను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన డిమాండ్ విషయంలో మీ వైఖరి స్పష్టం చేస్తారా? 17. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ హైదరాబాద్‌లో పెట్టబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కానీ దాన్ని సైతం గుజరాత్‌కు తీసుకెళ్ళలేదా? హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్‌కు ఒక్కపైసా సహాయం చేయకపోగా, పోటీగా గుజరాత్‌లో మరో సెంటర్‌ను పెట్టిన మాట వాస్తవం కాదా?
ఉచితాలు వద్దు అంటూ ఉపన్యాసాలు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు గుజరాత్‌పై ఉచితాల వర్షం కురిపిస్తున్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంపై అలవిగాని ప్రేమ చూయిస్తున్నారు. తన రాష్ట్రంపై ప్రేమ చూయించడం తప్పు కాదు. కానీ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూయించడంలోనే అసలు సమస్యంతా. గుజరాత్‌లో తన తాజా పర్యటనలో ప్రధాని మోడీ రూ. 29,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించారు. ఇందులో భావ్‌నగర్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్‌జి టెర్మినల్, అహ్మదాబాద్‌లోని మెట్రో రైల్ మొదటి దశ, సూరత్‌లో డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీ మొదటి దశ ఉన్నాయి.
మరో వైపు ఈ పెట్టుబడుల వర్షంతో పాటు ఎన్నికల నేపథ్యంలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన (పిఎంజికెఎవై) పథకాన్ని కూడా పొడిగించారు మోడీ. దీని వల్ల్ల కేంద్రానికి అదనంగా రూ. 44,762 కోట్లు ఖర్చు అవుతుంది. ఆయన దేశానికి ప్రధానిలా కాక గుజరాత్‌కు లేదా బిజెపి పాలిత రాష్ట్రాలకు ప్రధానిలా వ్యవహరిస్తున్నారు. 2021లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ప్రధాని యుపికి అనేక కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. రూ. 22,497 కోట్లతో నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే, కుషి నగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రధాని ఉచితాల సంస్కృతి గురించి మాట్లాడ లేదు.
కేంద్రంపై తరచూ విమర్శలెందుకు..? నిధుల పంపిణీ విషయంలో 15వ ఆర్థిక సంఘం కొన్ని సూచనలు చేసింది. దీని ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రాలకు ఉన్న ఆదాయ వనరులు 2011 జనాభా లెక్కలు, అటవీ విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, పన్నుల పరిస్థితి ఆధారంగా నిధులు ఇవ్వాలని సూచించింది. ఆయా ప్రతిపాదనల ప్రకారమే నిధుల కేటాయింపు జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా కొన్ని రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా ఇస్తున్నారన్న విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నందున, ఎక్కడైతే బిజెపి అధికారంలో ఉందో లేదా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆయా రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా ఇస్తున్నారనే విమర్శలు వస్తూనే ఉన్నాయి.
తెలంగాణ కంటే వాటికే ఎక్కువ.. బడ్జెట్‌లో పెట్టిన సెంట్రల్ ట్యాక్సు పూల్ నుంచి ఏయే రాష్ట్రాలకు ఎంత ఇవ్వనున్నారో ఒక్కసారి గమనిస్తే.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్, బీహార్‌లకు ఎక్కువ నిధులు దక్కాయి. ఉత్తరప్రదేశ్‌కు రూ.183237 కోట్లు.. తర్వాత బీహార్‌కు రూ.102737 కోట్లు ట్యాక్సు పూల్ నుంచి పంపిణీ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.41,338 కోట్లు ప్రతిపాదించింది. తెలంగాణకు రూ. 21,470 కోట్లు ఇవ్వాలనే ప్రతిపానదలు ఉన్నట్లు పేర్కొంది. కానీ ఇప్పుడూ అదే వివక్ష? కేవలం ఆరు నెలల్లో గుజరాత్‌కు రూ. 80,000 కోట్ల నిధులు కేటాయించిన ప్రధాని అదే సమయంలో ఇతర రాష్ట్రాలు విషయంలో వివక్షతో వ్యవహరిస్తున్నారు. తమ న్యాయబద్ధమైన గ్రాంట్‌ల కోసం కూడా విపక్ష పాలిత రాష్ట్రాలు అభ్యర్థించాల్సి వస్తోంది, ప్రాధేయపడాల్సి వస్తోంది. అయినా కేంద్రం రిక్తహస్తాలే చూపిస్తోంది. తెలంగాణ విషయాన్నే తీసుకుంటే మిషన్ భగీరథ నిర్వహణ కోసం రూ. 2,350 కోట్లు మంజూరు చేయాలని 15 వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. అయినా కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన రూ. 34,149.71 కోట్ల గ్రాంట్లు, ఇతర నిధుల కోసం పదే పదే అభ్యర్థనలు చేసినప్పటికీ కేంద్రం పట్టించుకున్న పాపానపోవడం లేదు. అనేక ప్రాజెక్టులను పదే పదే తిరస్కరిస్తోంది. తెలంగాణ పట్ల చూపిస్తున్న వివక్ష, గుజరాత్ పట్ల చూపిస్తున్న పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు.
తెలంగాణపై మళ్ళీ అదే వివక్ష!
- Advertisement -
- Advertisement -
- Advertisement -