మూడు రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశం
విపత్తు చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు
న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి అలాపన్ బందోపాధ్యాయ్‌కి కేంద్ర హోంశాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం,2005లోని నిబంధనల కింద నోటీస్ జారీ చేసినట్టు హోంశాఖ పేర్కొన్నది. చట్టంలోని 51బిని ఉల్లంఘించినట్టు నోటీస్‌లో గుర్తు చేసింది. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే ఈ చట్టం కింద రెండేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంటుంది. బెంగాల్‌పై ‘యాస్’ తుపాన్ ప్రభావంపై ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో తెలపాలని హోంశాఖ ఆదేశించింది.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య అధికారాల పరిధిపై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తుపాన్ సందర్భంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మాట్లాడేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశానికి మమత హాజరు కాకపోవడం పట్ల కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. బందోపాధ్యాయ్‌ని సోమవారం వరకల్లా కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై రావాల్సిందిగా ఇంతకుముందే ఆదేశించింది. వాస్తవానికి అదే రోజున(మే 31న) ఆయన రిటైర్ కావాల్సి ఉన్నది. అయితే, ఈ వివాదానికి ముందు ఆయన పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, కేంద్రం అంగీకరించింది. ఈ నేపథ్యంలో సోమవారం బందోపాధ్యాయ్ రిటైర్‌మెంట్‌ను మమత ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నియమించారు. దాంతో, మరో వివాదానికి మమత తెరతీశారు.