న్యూఢిల్లీ : దగ్గు, జలుబు, నొప్పి, చర్మం వాపు, వంటి వాటికి సాధారణంగా వాడే 14 ఔషధాలను ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా అందుబాటు అయ్యేలా ఓవర్ ది కౌంటర్ ( ఒటిసి) కేటగిరి లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. పారాసిటమల్, ముక్కు దిబ్బడం, యాంటీ ఫంగల్స్ ఔషధాలు త్వరలో ఎలాంటి ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా లభ్యమౌతాయి. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ డ్రగ్స్ నిబంధనలు 1945 కు సవరణలు సూచించింది. షెడ్యూలు కె కింద ఉన్న ఈ సాధారణ ఔషధాలను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నుంచి మినహాయిస్తారు. దీనివల్ల లైసెన్సుదారులైన విక్రేతలు ఒటిసి ద్వారా అమ్ముకోవచ్చు. పొవిడోన్ ఐయోడిన్, యాంటిసెప్టిక్, డిసిన్‌ఫెక్టంట్ ఏజెంట్, క్లోరోహెక్సిడిన్, క్లాట్రిమెజోల్, డెక్స్‌ట్రామెథోపాన్, హైడ్రోబ్రొమైడ్ లాజెంజెస్, అనాల్జిసిక్ ఆయింట్‌మెంట్ డిక్లోఫెనాక్, బెంజోల్ పెరాక్సైడ్, తదితర ఔషధాలు ఈ కేటరిగి లోకి రానున్నాయి. ఈ ప్రతిపాదనకు అంగీకారమైతే రిటైల్ ఒటిసి ద్వారా లభిస్తాయి. అయితే అయిదు రోజులకు మించి చికిత్స అవసరం లేనివారికే ఇవి ఇస్తారు. అంతకు మించి చికిత్స అవసరమైతే డాక్టర్‌ను సంప్రదించ వలసి ఉంటుంది.