నిరాశపరిచిన నిర్మల బడ్జెట్
కాళేశ్వరానికి జాతీయ హోదా లేదు
రైల్వే ప్రాజెక్టులకు నిధులు శూన్యం
అడియాసలైన పసుపుబోర్డు ఆశలు
ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిధులు ఊసులేదు
బయ్యారం ఉక్కు తుక్కే
గిరిజన విశ్వవిద్యాలయానికి కానరాని చోటు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నో ఆశలతో ఎదురు చూసిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ నిశాశే మిగిల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటిస్తుందని, రైల్వే ప్రాజెక్టులను నిధుల వరదతో పరుగులు తీయిస్తుందని. కేంద్ర విద్యా, పారిశ్రామిక సంస్థలకు నిధుల కేటాయింపులతో రాష్ట్రంపైన కొత్త వెలుగులు ప్రసరిస్తాయని, పసుపుబోర్డు ఏర్పాటుతో రైతుల జీవితాలు పసిడిమయంగా మారతాయని ఎన్డీఏ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్న ఆశలన్ని బడ్జెట్ ప్రకటనతో నీరుగారాయి. కేంద్ర ఆర్దికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2021-22వార్షిక బడ్జెట్‌లో ఎక్కడా కనీసం తెలంగాణ రాష్ట్రం పేరు కూడా లేకపోవటం తెలంగాణ పౌరసమాజాన్ని చివుక్కుమనిపించేలా చేసింది. సత్రం భోజనంలా అన్ని రాష్ట్రాలకు సాధారణంగా విదిల్చే పన్నుల వాటాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ తప్ప తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్‌లో కనీస ప్రాధాన్యత కూడా లేకుండా చేయటం పట్ల వివిధ రంగాలకు చెందిన నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అధికార బీజేపికి చెందిన రాష్ట్ర ఎంపీలు హామీలు ఇచ్చిన నిజామాబాద్ పసుపు బోర్డు ప్రతిపాదనలు కూడా చిత్తుకాగితాలుగా మారి చెత్తబుట్టల పాలయ్యాయని పసుపు రైతు కన్నెర్ర చేస్తున్నాడు.
మిషన్ భగీరధ, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో కనీసం ఏ ఒక్కదానికైనా జాతీయప్రాజెక్టు గుర్తింపు దక్కక పోతుందా అని ఎదురు చూసినా ఫలితం దక్కలేదు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చి రూ.52914కోట్లు కేటాయించాలని సిఎం కెసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని స్వయంగా కోరినా పట్టించుకోలేదు. రైల్వే ప్రాజెక్టుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం చేసిన వినతులు వినతులుగానే మిగిల్చారు. కాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ ఏర్పాటు కోసం ఏళ్ల తరబడి కేంద్రాన్ని కోరుతున్నా ఈ బడ్జెట్లోకూడ నిధుల ఊసెత్తలేదు. రైల్వే శాఖకు సంబంధించి డబ్లింగ్ పనులు, పలు కొత్తరైలు మార్గాల ప్రతిపాదనలు ఈ సారి కేంద్రబడ్జెట్లో కూడా పట్టాలెక్కలేకపోయాయి. ఏళ్లతరబడిపెండింగ్‌లో ఉన్న బయ్యారం ఉక్కు ప్రతిపాదన కేంద్రం ముందు తుక్కుగానే మిగిలిపోయింది.కేంద్రమంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలో గిరిజన విశ్వవిద్యాలయం మాటకూడ వినిపించలేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇదమిద్దంగా ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా నిధుల కేటాయింపు ప్రస్తావన కూడా చేయకపోవటం పట్ల కేంద్ర ప్రభుత్వవైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విభనచట్టం హామీలు ఉత్తవేనా..
రాష్ట్రవిభజన సందర్బంగా రాష్ట్రపునర్‌వ్యవస్థీకరణ చట్టం మేరకు కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు , చేసిన బాసలు ఉత్తిత్తివేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరేళ్ల కిందట ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోతే ఇక రానున్న రోజుల్లో ఇచ్చే కొత్త హామీలకు విశ్వసనీయత ఎలా ఉంటుందన్న ప్రశ్నలు వివిధ వర్గాలనుంచి పుట్టుకొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర విభాగానికి చెందిన భారత పరిశ్రమల సమాఖ్య, ఫ్యాఫ్సీ తదితర సంస్థల ప్రతినిధులు సైతం కేంద్ర బడ్జెట్ అనంతరం తమ ప్రతిస్పందనల్లో తెలంగాణ రాష్ట్రానికి తగిన న్యాయం జరగలేదని వెల్లడించారు. జాతీయ స్థాయిలో బడ్జెట్ ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర పరిధిలో పరిశీలిస్తే రాష్ట్రం కోరిన కొన్ని ప్రతిపాదనలకైనా కార్యరూపం ఇచ్చి నిధుల కేటాయింపులు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Centre neglected Telangana in Union Budget 2021-22