Wednesday, January 22, 2025

మరో బుల్డోజర్ బిల్లు!

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ బుల్డోజర్ పాలన ఒక చోట సాగి మరొక చోట ఆగడం అనేదానికి అవకాశమే లేదు. మత మైనారిటీల ఇళ్ళను చట్ట విరుద్ధంగా కూల్చడమే కాకుండా దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ విహిత పాలనను కుప్పకూల్చడానికి కూడా బిజెపి పాలక బుల్డోజర్లు నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని సర్వీసులపై లెఫ్టినెంట్ గవర్నర్ ఇష్టావిలాస పాలన స్థానంలో ఆ రాష్ట్ర ప్రజలెన్నుకొన్న ప్రభుత్వానికి అధికారాలు కట్టబెడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పార్లమెంటు ద్వారా ప్రభావ రహితం చేసిన కేంద్ర పాలకులు ఇప్పుడు ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లును తీసుకొచ్చారు. దీనిని గురువారం నాడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సిఇసి (చీఫ్ ఎలెక్షన్ కమిషనర్) ఇసి (ఎలెక్షన్ కమిషనర్) లను ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీయే నియమించాలని గత మార్చిలో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును వమ్ము చేయడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం సాహసిస్తున్నది.

ఇంతకంటే అప్రజాస్వామికం ఏమైనా వుంటుందా? ప్రభుత్వం తెచ్చిన బిల్లు ప్రకారం ఇక ముందు సిఇసి, ఇసిలను నియమించే కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, కేంద్ర మంత్రి వుంటారు. ఆ విధంగా దేశ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే ఇసిల నియామకంలో పాలక పక్షానికి ఎదురులేని స్థితిని కేంద్రం నెలకొల్పుకోదలచింది. దీనికి పూర్వరంగంలో సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ప్రక్షాళన చేయాలని సంకల్పించిన సందర్భం వున్నది. ఎన్నికల కమిషనర్ల నియామక పద్ధతిని సుప్రీంకోర్టు చెరిగి వదిలిపెట్టింది. రాజ్యాంగం మౌనాన్ని, ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఒక ప్రత్యేక చట్టమంటూ లేకపోడాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకొంటున్నారని ఆక్షేపించింది. రాజ్యాంగం 324 అధికరణ ఎన్నికల నిర్వహణకు ఇసిలను నియమించాలని సూచించింది గాని అందుకు అవసరమైన పద్ధతిని నిర్దేశించలేదు. అయితే పార్లమెంటు తగిన చట్టాన్ని చేయాలని మాత్రం సూచించింది. ఆ పని చేయకుండా ఈ అస్పష్టతను గత 72 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తనకు అనుగుణంగా వాడుకొంటున్నదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 2004 నుంచి ఏ ఒక్క ప్రధాన ఎన్నికల కమిషనరూ (సిఇసి) తనకున్న ఆరేళ్ళ పదవీకాలాన్ని పూర్తిగా వినియోగించుకోలేదని అత్యున్నత న్యాయస్థానం ఎత్తి చూపించింది.

యుపిఎ పదేళ్ళ పాలనలో ఆరుగురు సిఇసిలు, ఎన్‌డిఎ ఎనిమిదేళ్ళ పాలనలో ఎనిమిది మంది సిఇసిలు అర్ధంతరంగా పదవుల నుంచి వైదొలిగారని గుర్తు చేసింది. సిఇసికి 65 ఏళ్ళు గరిష్ఠ వయో పరిమితి కాగా, ఆలోగా ఆరేళ్ళ పదవీకాలాన్ని అనుభవించే అవకాశాన్ని చట్టం కలిగిస్తున్నదని అయితే ప్రభుత్వాలు వారు ఆ పదవీకాలాన్ని అనుభవించే అవకాశం లేకుండా చేస్తూ నియామకాలు జరుపుతున్నాయని సుప్రీంకోర్టు వేలెత్తి చూపించింది. ఈ విషయాన్ని కూలంకషంగా పరిశీలించిన జస్టిస్ కెఎం జోసెఫ్ అధ్యక్షతన గల రాజ్యాంగ ధర్మాసనం ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత కలిగిన కమిటీ వీరి నియామకాలను జరుపుతుందని స్పష్టం చేసింది. ప్రతిపక్ష నేత లేని పక్షంలో లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్షం నేత ఆ కమిటీలో వుంటారని చెప్పింది. ఆ పని చేయకుండా ప్రధాని మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లును శాసనం చేయబోడంలో సుప్రీంకోర్టును పార్లమెంటు కవచంతో ధిక్కరించదలచడమేనని బోధపడుతున్నది. రాజ్యాంగ ధర్మాసనం సూచించిన కమిటీ సిఇసి, ఇసిల ఎంపికను చేపడితే అది నిషక్షపాతంగా జరుగుతుంది.

ప్రధాని, సిజెఐ, ప్రతిపక్ష నేత కలిసిన ముగ్గురు కమిటీలో ఏ ఇద్దరి మెజారిటీ నిర్ణయమైనా ఇప్పుడు కేంద్రం ఉద్దేశించిన బిల్లులో మాదిరిగా పాలక పక్షం ఇష్టారాజ్యాంగా వుండబోదు. ఇలా ప్రతి విషయంలోనూ తన మాటే నెగ్గాలనే ధోరణిని కేంద్ర పాలకులు ప్రదర్శించడం దేశంలో ప్రజాస్వామ్య హితమైన నిర్ణయాలకు, పాలనకు అవకాశం లేకుండా చేయడమే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్రపాండే పదవీ విరమణ చేయవలసి వుంది. సరిగ్గా అప్పటికి పదిహేను, ఇరవై రోజుల తర్వాత 2024 లోక్‌సభ ఎ న్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలున్నాయి. అనూప్ చంద్రపాండే స్థానంలో కొత్త ఎన్నికల కమిషనర్ నియామకాన్ని తనకు అనుకూలమైన విధంగా చేసుకోవాలని బిజెపి కోరుకొంటున్నది. అందుకు వీలుగానే ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది రాజ్యాంగంపైనా, ప్రజాస్వామ్య పద్ధతిపైనా బుల్డోజింగ్ అని భావించడాన్ని ఎవరూ ఆక్షేపించజాలరు. యుపిలో, ఢిల్లీలో, మణిపూర్‌లో, హర్యానాలో జరిగింది ఒక తరహా బుల్డోజింగ్ అయితే ఇది అంతకంటే ప్రమాదకరమైనది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News