Friday, December 20, 2024

సారీ.. సీట్లివ్వలేం

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల వ్యవహారంలో చేతులెత్తేసిన కేంద్రం
నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం నిబంధనలు అనుమతించవని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో సంక్షోభం కారణంగా అక్కడి నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు చుక్కెదురైంది. అలా తిరిగొచ్చిన విద్యార్థులకు భారతీయ వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చట్టప్రకారం అందుకు ఎలాంటి నిబంధనలు లేనందున బదిలీ లేదా సర్దుబాటు కుదరదని తేల్చి చెప్పింది. భారత వైద్య కళాశాలల్లో సర్దుబా టు చేయాలని కోరుతూ ఉక్రెయిన్‌నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లపై స్పందిస్తూ కేంద్రప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. ‘ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులను ఇక్కడి మెడికల్ కాలేజీలు లేదా యూనివర్సిటీల్లో సర్దుబాటు చేయడం లేదా ఇక్కడికి బదిలీ చేసేందుకు నేషనల్ మెడికల్‌కమిషన్(ఎన్‌ఎంసి) అనుమతివ్వలేదు. విదేశీ వైద్య విద్యార్థులను భారత మెడికల్ కాలేజీలకు బదిలీ చేయడం లేదా సర్దుబాటు చేసే అంశానికి సంబంధించి ఇండియన్ మెడికల్ కమిషన్ యాక్ట్ 1956 లేదా నేషనల్‌మెడికల్ కమిషన్ యాక్ట్2019లో ఎలాంటి నిబంధనలు లేవు’ అని కేంద్రప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. అయినప్పటికీ అలాంటి విద్యార్థులు విదేశాల్లో ఎంబిబిఎస్ పూర్తి చేయడానికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు భారత విదేశాంగ శాఖతో ఎన్‌ఎంసి చర్చలు జరుపుతోంది. ఇందుకు సంబంధించి ఈ నెల 6వ తేదీన పబ్లిక్ నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. ఇక్కడ నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షలో అర్హత సంసాదించలేకపోవడం, ఆయా విద్యార్థుల ఆర్థిక స్తోమతును బట్టే వారంతా విదేశాలకు వెళ్లారని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. అటువంటి విద్యార్థ్లుకు ఇక్కడి వైద్య కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తే ఇతరత్రా ఇబ్బందులు తలెత్తుతాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. గత ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై సైనిక దాడి ప్రారంభించడంతో అక్కడి మెడికల్ కాలేజిల్లో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు ప్రాణ భయంతో స్వదేశానికి తిరిగివచ్చిన విషయం తెలిసిందే. వాళ్లను తీసుకు రావడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలను కూడా నడిపింది. అయితే తమ చదువులు ఆగిపోవడం, ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగిపోకపోవడంతో తమ చదువులను ఇక్కడే కొనసాగించేందుకు అనుమతించాలని వీరంతా కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటుగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే డిమాండ్‌తో కేంద్రానికి లేఖలు రాశారు. మరో వైపు ఉక్రెయిన్‌నుంచి తిరిగొచ్చిన విద్యార్థులను ఇక్కడి వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తూ విదేశాంగ శాఖపై లోక్‌సభ కమిటీ గత ఆగస్టు 3న ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదికతో ఆశలు చిగురించిన వైద్య విద్యార్థులు స్వదేశంలోని వైద్య కళాశాలల్లో తమ కోర్సులను కొనసాగించడానికి అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లను దాఖలు చేశారు. బెంచ్ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Centre no response on Ukraine returned medical students

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News