న్యూఢిల్లీ: ఇంటింటికీ రేషన్ సరుకులు అందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నూతన పథకానికి కేంద్రం బ్రేకులేసిందని ఆ రాష్ట్ర అధికారిక వర్గాలు తెలిపాయి. వచ్చే వారమే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కేంద్రం అడ్డుపడిందని ఆ వర్గాలు తెలిపాయి. పథకాన్ని ప్రారంభించడానికి అంతా సిద్ధం చేసుకున్న సమయంలో నిలిపి వేయాల్సిందిగా కేంద్రం నుంచి ఆదేశాలొచ్చాయని చెబుతున్నారు. ఈ పథకం అమలుకు తమ నుంచి అనుమతి తీసుకోనందున నిలిపివేయాలని ఆదేశిస్తున్నామని కేంద్రం తెలిపిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై కోర్టు కేసు ఉన్నందున అనుమతించడంలేదని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
ఈ పథకం గురించి ఈ ఏడాది మార్చిలో కేజ్రీవాల్ ప్రకటించినపుడే కేంద్రం నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనార్హం. ఆహార ధాన్యాల సేకరణ అనేది జాతీయ ఆహార భద్రతా చట్టం కింద జరుగుతుందని, రాష్ట్రాలు ప్రత్యేకంగా సొంత స్కీంలు పెట్టడాన్ని అనుమతించమని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం షరతులకు అనుగుణంగానే ఈ పథకాన్ని అమలు చేస్తానని ఆ సందర్భంగా కేజ్రీవాల్ కూడా రాజీ ధోరణిని ప్రదర్శించారు. కేజ్రీవాల్ ప్రచారం కోసమే కేంద్ర పథకాన్ని రాష్ట్ర పథకంగా మార్చేందుకు యత్నిస్తున్నారంటూ ఆ సందర్భంగా బిజెపి నేతలు విమర్శించారు.