వరికి దక్కని వరం.. కనీస మద్దతు ధర పెంచని కేంద్రం
ఉత్తరాదిలో సాగయ్యే గోధుమలకు రూ.110 పెంపు
కందికి రూ.500, ఆవాలకు రూ.400లకు, బార్లీకి రూ.100, పొద్దుతిరుగుడుకు రూ.209 పెంచిన కేంద్ర ప్రభుత్వం హస్తిన తీరుపై వరి రైతుల ఆగ్రహం
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి శుభవార్త అందించింది. పంట ఉత్పత్తులను ప్రోత్సహించి రైతుల ఆదాయం పెంచటంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. అయితే వరిసాగు చేసే రైతులకు మాత్రం మొండిచేయి చూపింది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రబీ పంటల సీజన్ కింద అత్యధిక విస్తీర్ణంలో వరిసాగులోకి వస్తుంది. రబీ పంటకాలానికి సంబంధించి ఉత్తరాది రాష్ట్రాల్లో పండించే గోధుమ పంటకు మాత్రం కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా సాగుచేసే వరి విషయంలో మద్దతు ధరను నయాపైసా కూడా పెంచలేదు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో జరిగిన కేబినెట్ ఆర్ధిక వ్యవహారాల కమిటి(సిసిఈఏ) సమావేశంలో రబీపంటలకు మద్దతు
ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రబీ సీజన్‌కు సంబందించి 202324 పంటకాలానికి గాను ఈ పెంపుదల వర్తించనున్నట్టు తెలిపింది. రబీలో సాగు చేసే పంటలకు సంబంధించి క్వింటాలకు కంది పంటకు రూ.500 పెంచింది. అదే విదంగా గోధుమలకు రూ.110, ఆవాలుకు రూ.400, బార్లీకి రూ.100, పొద్దుతిరుగుడుకు రూ.209, మసూర్ పప్పుకు రూ.500పెంచినట్టు వెల్లడించింది.
తాజా పెంపుదలతో క్వింటాలు గోధుమల ధర రూ.2015నుండి రూ.2125కు చేరనుంది. గోధుమ పంట పెట్టుబడి వ్యయం క్వింటాలుకు రూజ1065గా కేంద్రం అంచనా వేసింది. బార్లీ ధర క్వింటాలకు రూ.1735కు చేరనుంది. అదేవిధంగా పప్పుశనగల ధర క్వింటాలుకు రూ. 5230నుండి రూ.5335కు చేరనుంది. మసూర్ పంట మద్దతు ధర రూ.6000కు పెరగనుంది. ఆవాలు కనిస మద్దతు ధర రూ.5050నుంచి రూ.5450కి పెరగనుంది. కుసుమ పంట ధర రూ.209పెంపుదలతో క్వింటా ధర రూ.5650కి చేరుకోనుంది. పొద్దుతిరుగుడు పంటకు రూ.209 పెంపుదలతో క్వింటాలు ధర రూ.5650కి పెరగనుంది. 202223 రబిపంటకాలానికిగాను పెంచిన మద్దతు ధరలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి ఆనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. ధాన్యానికి కనీస మద్దతు ధరను పెంచకపోవటం పట్ల వరిరైతులు కేంద్ర ప్రభుత్వం తీరుపై మంటలు కక్కుతున్నారు.
Centre not hikes msp of Paddy Crop