న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకించింది. ఈ పిటిషన్ల విచారణ అర్హతను ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టు లో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. తమను తాము ఉన్నత నాగరికులుగా భావించుకునే కొందరు, వారి అభిప్రాయాలను సమాజం ఆమోదించాలనే ఉద్దేశంతో ఈ పిటిషన్లు వేశారని, కేంద్రం అభిప్రాయపడింది. ఇలాంటి బంధాలను, ప్రస్తుత వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణిస్తే అది ప్రతి పౌరుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కేంద్రం అభిప్రాయపడింది. అంతేగాక, వివాహాలను గుర్తించడం పూర్తిగా చట్టపరమైన అంశమని, దీనికి కోర్టులు దూరంగా ఉండాలని కోరింది.
Also Read: అమిత్ షా రాజీనామా చేయాలి: మమతా బెనర్జీ
“వివాహం చట్టబద్ధత అనేది ఒక సామాజిక చట్టపరమైన వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం… దీన్ని చట్టసభలు సృష్టించాయి. దాని ప్రకారమే వివాహానికి చట్టబద్ధత రావాలి. వివాహాలకు చట్టబద్ధతనిచ్చే అంశంలో పార్లమెంట్ అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. గ్రామీణ, సెమీ రూరల్, పట్టణ, నగర ప్రాంత ప్రజల అభిప్రాయాలు, మతపరమైన అంశాలు, ఆచారాలు ఇవన్నింటినీ పరిశీలించిన తర్వాతే చట్టాలను రూపొందిస్తారు. కొత్త బంధాలను గుర్తించడం, ఆ బంధాలకు చట్టబద్ధత కల్పించడం, వంటివి కూడా చట్టసభ్యులే నిర్ణయించాలి. అంతేగానీ ఇది న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదు.
Also Read: గోమూత్రం తాగండి బుద్ధి వస్తుంది: బిజెపి నేతలకు సలహా
అందుకే ఈ అంశంలో కోర్టులు దూరంగా ఉండాలి” అని కేంద్రం తమ పిటిషన్‌లో కోరింది. ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుందని కేంద్రం ఈ సందర్భంగా పేర్కొంది. స్వలింగ వివాహాల చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నుంచి విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నేడు పిటిషన్ దాఖలు చేసింది. అయితే, కేంద్రం వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం… దీనిపై కూడా మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది.