న్యూఢిల్లీ: సమాచార సాంకేతిక చట్టం(ఐటి) 2000 సెక్షన్ 66ఎ కింద నమోదైన కేసులను ఎత్తి వేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సెక్షన్ కింద కొత్తగా కేసులేవీ నమోదు చేయవద్దని పోలీస్ అధికారులను కూడా ఆదేశించింది. ఈ సెక్షన్ 66 ఎను రద్దు చేస్తూ 2015లోనే సుప్రీం కోర్టు తీర్పు వెలువరించి ఆరేళ్లయినా ఇప్పటికీ వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కావడంపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇటీవల ఆగ్రహం వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రెండు వారాల్లోగా స్పందించాలంటూ సుప్రీం కోర్టు జులై 5న కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సెక్షన్ 66 ఎ కేసులను తక్షణం వెనక్కు తీసుకోవాలంటూ కేంద్రం రాష్ట్రాలను కోరింది. సుప్రీం తీర్పు తరువాత దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 1307 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా కేసులు నమోదయ్యాయి.
Centre orders withdrawal of all Cases under Section 66A