Monday, January 20, 2025

ఢిల్లీపై కేంద్రం ఆర్డినెన్స్!

- Advertisement -
- Advertisement -

కేంద్రాన్ని పాలిస్తున్న బిజెపి పెద్దలు దేశంలో ప్రజాస్వామ్యం ఎంత మాత్రం కొనసాగరాదని కోరుకొంటున్నట్టు మరోసారి మరింత స్పష్టంగా వెల్లడైంది. ప్రజాస్వామ్యం పేరుతో తమ ఇష్టారాజ్యం సాగాలని వారు ఆశిస్తున్నారు. ప్రజల ఓటుతో నిరంకుశాధికారాన్ని చలాయించాలని గట్టిగా పట్టుదల వహించినట్టు బోధపడుతున్నది. ఢిల్లీలో శాంతి భద్రతలు, పోలీసు, భూమి సంబంధ వ్యవహారాలను కేంద్రం చేతిలోనే కొనసాగనిస్తూ ఇతర పాలనా ‘సర్వీసు’లపై ప్రజలెన్నుకొన్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగులేని అధికారాన్ని ఇటీవల వెలువడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కట్టబెట్టింది. దానిని చెత్తబుట్టలో వేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.

భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ అధ్యక్షతన గల ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి)ను ఇతర రాష్ట్రాల గవర్నర్‌ల స్థాయికి కుదిస్తూ ఉత్సవ విగ్రహాన్ని చేయగా, కేంద్రం ఆర్డినెన్స్ తిరిగి ఎల్‌జికి గుత్తాధిపత్యాన్ని కట్టబెడుతున్నది. కేంద్రం తెచ్చిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (జాతీయ రాజధాని ప్రాంతం) ఆఫ్ ఢిల్లీ (సవరణ) ఆర్డినెన్స్ జాతీయ రాజధాని సివిల్ సర్వీసుల సంస్థను నెలకొల్పదలచింది. దీనికి ఢిల్లీ ప్రజలెన్నుకొన్న ముఖ్యమంత్రి అధ్యక్షుడుగా వుంటారని చెప్పి ఆయనతో పాటు కేంద్ర హోం శాఖ చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా అందులో వుంటారని ఆర్డినెన్స్ చెప్పింది. ఢిల్లీ పరిపాలనా వ్యవహారాల విభాగాల అధిపతులైన ఐఎఎస్ అధికారులు, ఇతర సిబ్బంది నియామకాలు, బదిలీలపై ఈ ముగ్గురూ మెజారిటీ ఓటింగ్ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని లెఫ్టినెంట్ గవర్నర్ అనుగ్రహానికి, ఆమోదానికి పంపించాలి. ఎల్‌జి ఆ నిర్ణయాలతో విభేదిస్తే పునఃపరిశీలనకు తిరిగి పంపించవచ్చు.

జాతీయ రాజధాని సివిల్ సర్వీసుల సంస్థకు ఎల్‌జికి మధ్య ఏకీభావం కుదరనప్పుడు ఎల్‌జిదే అంతిమ నిర్ణయం అవుతుంది. అంటే పూర్వం కంటే దృఢంగా, కఠినంగా ఢిల్లీ రాజధాని ప్రాంతంపై తన ఉక్కు పాదం మోపాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేయించిందని స్పష్టపడడం లేదా. ప్రజలెన్నుకొన్న ముఖ్యమంత్రిని ఉత్సవ విగ్రహం చేయాలని కేంద్రం కోరుకొంటున్నదని బోధపడడం లేదా? సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఈ నెల 11నే వచ్చింది. గట్టిగా 15 రోజులైనా తిరగక ముందే దానిని పనికిరానిదిగా చేయాలని పాలకులు ఎందుకు తొందరపడినట్టు? సుప్రీంకోర్టు మీద కక్షతోనా? జాతీయ రాజధానిలో తీసుకొనే ఎటువంటి నిర్ణయమైనా లేదా అక్కడ జరిగే ఎట్టి సందర్భమైనా అక్కడ నివసించే ప్రజల మీద మాత్రమే కాకుండా మిగతా దేశమంతటి మీద ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ దృష్టిలో దేశ పరువు, ప్రతిష్ఠలను కూడా ప్రభావితం చేస్తుందనే కారణం చూపి ఈ ఆర్డినెన్స్‌ను కేంద్రం తీసుకురాడం ఎంత అసభ్యంగా, అనాగరకంగా వుందో చెప్పనక్కర లేదు.

అంటే తాము చేసేవే గొప్ప నిర్ణయాలు, సందర్భాలు అని ఇతరులు చేసేవి అనుమానించదగినవని కేంద్ర పాలకులు భావిస్తున్నారని చెప్పాలి. వారికి దేశ ప్రజలు అధికారం కట్టబెట్టిన విధంగానే ఢిల్లీ ప్రజలు అక్కడి ఎన్నికల్లో ఆ రాష్ట్ర పాలకులను ఎన్నుకొంటారు కదా?అటువంటి ప్రాతినిధ్య ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేయడమేమిటి? ఢిల్లీ జాతీయ రాజధాని కాబట్టి రాజ్యాంగంలో దానికి ప్రత్యేక పరిస్థితులను కల్పించారు. అందుకే శాంతిభద్రతలు, భూ వ్యవహారాలను కేంద్రానికి అప్పగించారు. అదే సమయంలో ఎన్నికైన ప్రభుత్వంతో కూడిన రాష్ట్రంగా జాతీయ రాజధాని ప్రాంతాన్ని మార్చినప్పుడు అక్కడ ఎన్నికైనది నూటికి నూరుపాళ్ళు ప్రాతినిధ్య ప్రభుత్వమే అవుతుంది. ప్రజాస్వామిక అధికారాలన్నీ దానికి సంక్రమిస్తాయి. ఈ విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం ఎంతో ఆలోచించి స్పష్టం చేసింది. దానిని గౌరవించకపోడం కేంద్ర పాలకుల పెత్తందారీ తనాన్నే రుజువు చేస్తున్నది. నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఎల్‌జికి వీటో అధికారం ఇవ్వడం సరైనది కాదని ఒక్క కంఠంతో చెబుతున్నారు.

ఈ ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం రాజ్యాంగ ధర్మాసనం తీర్పును పునః పరిశీలించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఒకవైపు దానిని ధిక్కరిస్తూ మరోవైపు దానిని ఆశ్రయించడమే, ఇదెంత వరకు సబబు! ఈ ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని ప్రజాస్వామ్య ప్రియులు ఎదురు చూడవచ్చు.ఈలోగా ఆర్డినెన్స్ చట్టం కాకుండా చేయడం ద్వారా దాని ఊపిరి తీసేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాజ్యసభలో ప్రతిపక్షాలన్నీ కలిస్తే అది సాధ్యమే. 238 మంది ఎన్నికైన సభ్యులున్న రాజ్యసభలో బిజెపి కూటమి ఎన్‌డిఎకి 110 మంది సభ్యుల బలముండగా, ఐక్యప్రతిపక్షానికి 128 మంది వున్నారు. అంటే కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు కలిస్తే ఆర్డినెన్స్ వీగిపోతుంది. అంతిమంగా ఢిల్లీలో బిజెపి పాలకుల కుతంత్రం చెల్లబోదనే ఆశిద్దాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News