Friday, November 1, 2024

బొగ్గుకు కొరత లేదు

- Advertisement -
- Advertisement -

Centre rubbishes claims of coal shortage

సరఫరాలోనే లోపం, విద్యుత్ సంక్షోభం రాదు : కేంద్రం ప్రకటన

వాస్తవ విరుద్ధంగా సాగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని బొగ్గు మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి

ప్రస్తుతం కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం వద్ద 43 మిలియన్ టన్నుల వరకు నిల్వలు ఉన్నాయి
24 రోజులపాటు బొగ్గు అవసరాలు తీరుతాయి
రెండు మూడు రోజుల్లోనే నిల్వలు అడుగంటుతాయనే భయం ఎందుకు?
పలు ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల సరఫరాకు ఆటంకాలేర్పడ్డాయి
విద్యుత్ కేంద్రాలకు సగటున రోజుకు 18.5లక్షల టన్నుల బొగ్గు సరఫరా జరగాల్సి వుండగా 17.5లక్షల టన్నులే సరఫరా అవుతుంది
కేంద్రాల వద్ద దాదాపు 72లక్షల టన్నుల వరకు బొగ్గు ఉంది

న్యూఢిల్లీ : దేశంలో విద్యుత్ సరఫరా విచ్ఛిన్నం వార్తలు పూర్తిగా దురుద్ధేశపూరితం అని కేంద్రం తెలిపింది. విద్యుత్ సంక్షోభం పొంచి ఉందనే వాదన అసంబద్ధం అని తేల్చిచెప్పింది. సంబంధిత అంశంపై బొగ్గు గనుల మంత్రిత్వశాఖ ఆదివారం ప్రకటన వెలువరించింది. దేశంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరం అయిన పొడి బొగ్గు ఇంధన ముడిపదార్థం దండిగా అందుబాటులో ఉంది. విద్యుత్ ఉత్పాదక సామర్థం దెబ్బతినకుండా తగు విధంగా బొగ్గు సరఫరా చేసే పరిస్థితి ఉంది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుందనే వార్తలలో నిజం లేదని బొగ్గు మంత్రిత్వశాఖ ప్రకటనలో వివరించారు. దేశ రాజధాని ఢిల్లీ, యుపి, తమిళనాడు ఇతర ప్రాంతాలలో అతి తక్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయని, దీనితో విద్యుతు ఉత్పాదన శక్తి అడుగంటి పోయిందని, పలు ప్రాంతాలలో బ్లాకౌట్ తప్పదనే వార్తలు సంచలనానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో బొగ్గు మంత్రిత్వశాఖ కీలక ప్రకటన వెలువరించింది. విద్యుత్ కేంద్రాల డిమాండ్‌కు తగ్గట్లుగా బొగ్గు ఉంది. ముడిసరుకు అందుబాటులో లేదనే వార్తలను విశ్వసించరాదని బొగ్గు శాఖ ప్రకటించింది. బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషీ కూడా సంబంధిత అంశంపై ట్వీటు వెలువరించారు.

దేశంలో బొగ్గు ఉత్పత్తి, అవసరం అయిన కేంద్రాలకు సరఫరా వంటి అంశాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకున్నట్లు వివరించారు. ఇప్పటి నిల్వలు దాదాపుగా 43 మిలియన్ టన్నుల వరకూ కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాయి. వీటితో దాదాపుగా 24 రోజుల బొగ్గు అవసరాలను తీర్చేందుకు వీలుంది. ఇక రెండు మూడురోజులలోనే బొగ్గు నిల్వలు అడుగంటుతాయనే భయాలు ఎందుకు? వాస్తవం వేరే ఉండగా ఇందుకు విరుద్ధంగా ఇటువంటి అసత్య ప్రచారం ఎందుకు జరుగుతున్నదో తెలియడం లేదని మంత్రి తమ ట్వీటులో తెలిపారు. పలు ప్రాంతాలలో విస్తారిత వర్షాకాలం భారీ వర్షాలతో సహజంగానే బొగ్గు సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ రోజువారి ప్రాతిపదికన కోల్ కంపెనీల నుంచి ఎప్పటికప్పుడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు కోటా అందించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్పత్తికి అవసరం అయిన బొగ్గు నిల్వలు పూర్తిగా తగ్గే అవకాశం లేనే లేదని మంత్రి స్పష్టం చేశారు.

నిజానికి ఇంతకు ముందటితో పోలిస్తే స్వదేశీ బొగ్గు సరఫరా కోటాను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు నిల్వలతో ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటున్నట్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వలకు కొరత లేకుండా చూసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రోజువారి లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 17.5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా జరుగుతోంది. అయితే సగటుర రోజువారిగా దాదాపుగా 18.5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా జరగాల్సి ఉంది. ఈ లెక్కన డిమాండ్ సరఫరాలో అతి కొద్ది లోటే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదన దాదాపుగా 24 శాతం పెరిగింది. ఓ మోస్తరు బొగ్గు సరఫరాతోనే ఈ విధమైన పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు. ఇక విద్యుత్ కేంద్రాల వద్ద ఇప్పటివరకూ దాదాపు 72 లక్షల టన్నుల వరకూ బొగ్గు అందుబాటులో ఉంది.

ఇది దాదాపు నాలుగు రోజుల వరకూ సరిపోతుంది. అయితే కోల్ ఇండియా వద్ద దాదాపుగా 400 లక్షల టన్నుల వరకూ బొగ్గు నిల్వలు ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు విద్యుత్ కేంద్రాలకు యుద్ధ ప్రాతిపదికననే పంపిస్తున్నారని బొగ్గు మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ పరిస్థితులలో బొగ్గు లేకపోవడంతో పరిస్థితి తలకిందులు అవుతుందనే భయాలు కానీ, విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు లేనేలేవనే వార్తలలో నిజం లేనేలేదని గమనించాలని స్పష్టం చేశారు. ఈసారి బొగ్గు గనుల ప్రాంతాల్లో భారీ కుండపోత వర్షాలు పడ్డాయి. వరదలు కూడా సంభవించాయి. పలు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కోల్ ఇండియా లిమిటెడ్ ఈ ఏడాది ఇప్పటికే 255 మిలియన్ టన్నుల మేరకు బొగ్గు సరఫరా చేసిందని, ఇది విద్యుత్ రంగానికి ఇంతకు ముందెన్నడూ లేనంత అత్యధిక బొగ్గు సరఫరా అని స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News