న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ టీకాల సేకరణను కొంతకాలం నిలిపివేసేందుకు సిద్ధమైంది. అందుకు కేటాయించిన బడ్జెట్‌ను ఆర్థిక శాఖకు సరెండర్ చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించినట్టు సమాచారం. 2022-23 బడ్జెట్‌లో వ్యాక్సినేషన్ కోసం చేసిన కేటాయింపులో ఇది 85 శాతం కావడం గమనార్హం. మూడో డోసు వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సుమారు 1.8 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మరో ఆరు నెలల పాటు వ్యాక్సినేషన్‌ను కొనసాగించేందుకు ఇవి సరిపోతాయని అంచనా. ఒకవేళ ప్రభుత్వం దగ్గర ఉన్న నిల్వలు నిండుకుపోయినా, మార్కెట్లో వీటి లభ్యత ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో కొవిడ్ టీకాల డోసులను సేకరించాలా? వద్దా? అనే విషయమై ఆరు నెలల తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి 16, 2021 న దేశ వ్యాప్తంగా మొదలు పెట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచితం గానే టీకాలు అందిస్తోంది. ఇప్పటివరకు 219 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దేశ వ్యాప్తంగా అర్హుల్లో 98 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకోగా, 92 శాతం రెండు డోసులు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది వ్యాక్సిన్ పంపిణీకి 202223 బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించింది. ప్రస్తుతం మూడో డోసు పంపిణీ చేస్తున్నప్పటికీ కొవిడ్ ప్రాబల్యం తగ్గడంతో టీకా తీసుకునేందుకు లబ్ధిదారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో సేకరించిన టీకాల వినియోగ గడువుతో అవి వృధా అయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వాటి కోసం కేటాయించిన బడ్జెట్‌లో రూ. 4237 కోట్లను ఆర్థిక శాఖకు అప్పగించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Centre says not to procure fresh covid vaccine