10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ నిర్ణయం
3నుంచి 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉండనున్న బృందాలు
న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్ విస్తరించగా 400కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఒమిక్రాన్, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. ‘ఒమిక్రాన్, కొవిడ్ కేసులు పెరుగుతున్న, వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న 10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించాలని నిర్ణయించాం. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరాం, కర్నాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్లనున్నాయి’ అని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ బృందాలు 3నుంచి 5 రోజుల పాటు ఆయా రాష్ట్రాల్లో ఉండనున్నాయి. కొవిడ్ పరీక్షలు, కరోనా నిబంధనల అమలు వంటి అంశాలపై రాష్ట్ర అధికారులతో కలిసి పని చేయనున్నాయి.
దీంతో పాటు వ్యాక్సినేషన్ పెంపు, ఆస్పత్రులో ్లసౌకర్యాలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యత తదితర అంశాలను పరిశీలించి కేంద్రానికి నివేదించనున్నాయని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415కు చేరుకున్న విషయం తెలిసిందే. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43, తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్నాటకలో 31 కేసులు నమోదయ్యాయి. మరో వైపు దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 7,189 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. ఇందులో అత్యధికంగా కేరళలో 2,605, మహారాష్ట్రలో 1,410, తమిళనాడులో 597 కేసులు నమోదయ్యాయి. 387మంది కరోనాతో మృతి చెందారు. యాక్టివ్ కేసులు 77,032 కు తగ్గాయి.2020 మార్చి తర్వాత యాక్టివ్ కేసులు ఇంత తక్కువగా ఉండడం ఇదే మొదటి సారి. అలాగే రికవరీ రేటు 98.40కు పెరిగింది. ఒమిక్రాన్‌పై అప్రమత్తగా ఉండాలని, అవసరమైతే రాత్రి కర్ఫూలు పెట్టాలని ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను కోరిన విషయం తెలిసిందే. దీంతో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలను అమలులోకి తెచ్చాయి. క్రిస్మస్, న్యూయర్ వేడుకలపై పలు చోట్లు నిషేధం విధించారు.
Centre Sends Teams to 10 States with low vaccination