మున్సిపల్ ఎన్నికలు మరోఏడాది ఆలస్యం ?
న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ వార్డులను తాజాగా పునర్విభజించే కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీలుగా ముగ్గురు సభ్యుల కమిషన్‌ను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నియమించింది. ఈ ప్యానెల్‌కు ఢిల్లీకి చెందిన స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ విజయ్‌దేవ్ ఛైర్మన్‌గా, కేంద్ర గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్ , మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ( ఎంసిడి అడిషనల్ కమిషనర్ రణధీర్ సహాయ్ సభ్యులుగా ఉంటారని ఎంసిడి శనివారం ప్రకటనలో పేర్కొంది.ఇటీవలనే ఢిల్లీ లోని నార్త్, సౌత్, ఈస్ట్ అనే ఢిల్లీ మూడు కార్పొరేషన్ల పునరేకీకరణ జరిగింది. ఇప్పుడు వార్డుల పునర్విభజన జరిగితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగడానికి మార్గం ఏర్పడుతుంది. ఈ ప్రకియ అంతా పూర్తయ్యేసరికి సంవత్సరం పడుతుంది కాబట్టి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు ఏడాది పాటు ఆలస్యం కానున్నదని భావిస్తున్నారు. ప్యానెల్ ఏర్పాటు తరువాత కమిషన్ తన నివేదికను నాలుగు నెలల్లో సమర్పించ వలసి ఉంటుంది. ఎంసిడి పునరేకీకరణ ప్రక్రియ గత మేనెలలో ప్రారంభమైంది. 1958లో మొదట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. షీలాదీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 2012 లో మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా చీలికైంది.
ఈ మూడు కార్పొరేషన్లను పునరేకీకరణ చేయడానికి పార్లమెంట్ ఈ ఏడాది ఏప్రిల్ 5న ఢిలీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లును ప్రవేశ పెట్టింది. మూజువాణీ ఓటుతో రాజ్యసభ దీన్ని ఆమోదించింది. ఈ పునరేకీకరణ వల్ల సమన్వయంతోపాటు వ్యూహాత్మక ప్రణాళిక అమలుకు వనరులను సద్వినియోగం చేయడానికి వీలవుతుందని బిల్లులో పేర్కొన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏప్రిల్‌లో ఎన్నికలు జరగవలసి ఉంది. ఢిల్లీ లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల వార్డులన్నీ కలిపి 272 వార్డులుండగా, ఇప్పుడు 250కు పరిమితం చేస్తారు. ఉభయ సభలు ఆమోదించిన తరువాత డీలిమిటేషన్ కమిషన్ ( పునర్విభజన కమిషన్ ) పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రస్తుతం డిల్లీ అసెంబ్లీలో 70 నియోజక వర్గాలున్నాయి. అసెంబ్లీ నియోజక వర్గాల్లోని జనాభాను బట్టి వార్డులను పునర్విభజిస్తారు. ఈ ప్రక్రియకు ఆరునెలలు పడుతుంది. అది పూర్తి కాగానే కమిషన్ నివేదిక కేంద్రానికి అందుతుంది. కేంద్రం దాన్ని గుర్తించిన తరువాత వార్డుల వారీగా ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది.