ఆర్‌టిఐ దరఖాస్తుకు కేంద్రం జవాబు
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2020లో జరిపిన 36 గంటల భారత పర్యటన సందర్భంగా వసతి, భోజనాలు, రవాణా తదితర సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 38 లక్షలు ఖర్చు చేసినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర సమాచార కమిషన్‌కు తెలియచేసింది. తన భార్య మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు జరేడ్ కుష్నర్‌తో కలసి ట్రంప్ 2020 ఫిబ్రవరి 24, 25 తేదీలలో మొట్టమొదటిసారి భారత్‌ను సందర్శించి అహ్మదాబాద్, ఆగ్రా, న్యూఢిల్లీలో పర్యటించారు. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లో మూడు గంటలు గడిపిన ట్రంప్ 22 కిలోమీటర్ల పొడవైన రోడ్‌షోలో పాల్గొనడంతోపాటు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన మోతేర క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీతో కలసి నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఫిబ్రవరి 25న న్యూఢిల్లీని సందర్శించి ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ట్రంప్ పర్యటన కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలియచేయాలని కోరుతూ మిషాల్ భతేనా అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్‌టిఐ దరఖాస్తుకు విదేశీ వ్యవహారాల శాఖ తాజాగా సమాధానమిచ్చింది.