Thursday, January 23, 2025

మహిళల అదృశ్యం!

- Advertisement -
- Advertisement -

తల్లీ భారతీ అంటాం, తండ్రీ భరతుడా అని ఎవరూ అనరు, అమ్మా, జననీ అంటూ వేనోళ్ళ కీర్తిస్తాం, కలకత్తా కాళికతో పోలుస్తాం, ఆదిశక్తీ అంటాం. అదే సమయంలో మహిళను రాచి, రంపాన పెడతాం. దిక్కున్న చోట చెప్పుకో అని ఇంట్లోంచి బయటకు గెంటి వేస్తాం. ఏ చెట్టో, పుట్టో చూసుకోడం తప్ప ఆమెకింక దిక్కెక్కడిది? దేశంలో అలా కనిపించకుండా పోయిన మహిళలు, బాలికల సంఖ్య మూడేళ్ళ వ్యవధిలో 13 లక్షలకు మించిపోయిందని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకు తెలియజేసింది. అంటే, ఇక్కడ స్త్రీ పరిస్థితి ఎంత దయనీయంగా వుందో అర్థం చేసుకోవచ్చు. భర్తలు, అత్తమామలు పెట్టే ఆరళ్ళను, చేసే అవమానాలను తట్టుకోలేక, భరించలేక ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్న మహిళల గురించి చెప్పనక్కర లేదు. ఎందుకిలా, ఏమిటిలా అని ప్రశ్నించుకొని సమాధానం వెతుక్కొనే తీరికే వుండదు మన పాలకులకు. పైపెచ్చు నాలుగ్గోడలకే పరిమితమై, తమ పురుషులకు ఉపయోగడడం, ఇంటి బాధ్యతలు నిర్వర్తించడమే భారతీయ మహిళ పవిత్ర బాధ్యత, ధర్మం అని నీతులు చెప్పడం, ప్రవచనాలు గుప్పించడం నిత్యకృత్యమైపోయింది.

పురుషుడికి ఎంతగా తలవొగ్గి వుంటే ఆ స్త్రీకి అంతగా పుణ్యం దక్కుతుందని చెప్పేవారికి కొరత లేదు. ఇక్కడ ఆడ శిశువు పుట్టిన తర్వాత పెళ్ళీడు వరకు పెంచి, పోషించి కట్నకానుకలు సహా మగవాడి చేతిలో పెట్టడమే జరుగుతున్నది గాని, ఆమె తన కాళ్ళ మీద తాను స్వతంత్రంగా బతికే స్తోమతను ఆమెకు కలిగించడమనేది అత్యంత అరుదుగా మాత్రమే చూస్తాము. ఆడ పిల్ల పుట్టిదంటే వెయ్యి టన్నుల భారం నెత్తిమీద పడిందనే అభిప్రాయాన్ని సమాజం పని కట్టుకొని స్థిరపరిచింది. ఈ అభిప్రాయంతో దంపతులు తమకు ఆడ పిల్ల పుట్టకూడదని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకొంటారు. పుట్టే బిడ్డ ఆడో, మగో తెలుసుకొని ఆడ అయితే భ్రూణ హత్య చేసి వదిలించుకోడానికి, ఆ నేరం కన్న తల్లిదేనని దండోరా వేయడానికి, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణకు తెగబడుతున్నారు. ప్రభుత్వాలు నిషేధించినా ఇటువంటి ఆసుపత్రులు ఆహోరాత్రాలు పని చేస్తున్నాయి.

ఆడ పిల్లను ఒకవేళ బాగా చదివించి మంచి ఉద్యోగం వచ్చేలా చూసినా ఆమెను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనీయకుండా తాము చూసి కట్టబెట్టే భర్త అదుపాజ్ఞల్లో బతికేటట్టు ఏర్పాటు చేస్తారు. పర పురుషుడి గాలి సోకకుండా నిరంతరం కాపలా కాస్తారు. ఈ నేపథ్యంలో భారత స్త్రీ వికాసం, ప్రగతి ఎలా సాధ్యం? 2019-21 మధ్య గల మూడేళ్ళలో దేశంలో 18 ఏళ్ళు పైబడిన మహిళలు 10, 61,648 మంది, 18 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న బాలికలు 2,51,430 మంది అదృశ్యమయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా (ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతుల మీదికి కార్లు తోలించి పలువురి దుర్మరణానికి కారకుడైన యువకుడు ఆశిష్ మిశ్రా తండ్రి) గత నెల 26న రాజ్యసభలో ప్రకటించారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 2 లక్షల మంది మహిళలు, బాలికలు తప్పిపోయారని ఆయన ప్రకటన తెలియజేసింది. రెండో స్థానంలో గల పశ్చిమ బెంగాల్‌లో 1,56,905 మంది మహిళలు, 36,606 మంది బాలికలు అదృశ్యమయ్యారు.

వీరిలో చాలా మంది అభాగ్యులు వ్యభిచార గృహాలకు చేరి వుండే ప్రమాదాన్ని కూడా కాదనలేము. ఇటువంటి వారి కోసం వలలు విసిరే దుర్మార్గులూ వున్నారు. ఈ సమస్య మూలంలో వున్నది మహిళకు సమాజం ఇచ్చిన ద్వితీయ శ్రేణి పౌరసత్వమే. దేశంలో మేట వేసుకొని వున్న దుర్భర దారిద్య్రం కూడా ఇందుకు కారణమే. పేదరికం తగ్గుముఖం పడుతున్నదని ఎంతగా, ఎన్ని సంస్థలు చెబుతున్నా అందులో వాస్తవం సున్నా. ఆహార ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు తీసుకొనే కేలరీలు దారుణంగా తగ్గిపోయి ఆకలితో అలమటిస్తున్నవారి సంఖ్య పైకి వెళుతున్నదే గాని దిగువ చూపు చూడడం లేదు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక ప్రకారం 2021లో దేశంలో 1,64,033 ఆత్మహత్యలు సంభవించాయి.

ఇండియాలో ఆత్మహత్యల రేటు అంతర్జాతీయ రేటు కంటే ఎక్కువగా వున్నదని, ముఖ్యంగా మహిళల్లో అధికమని ఈ నివేదిక వెల్లడించింది. మన దేశంలో ప్రతి లక్ష మంది మహిళల్లో 11.1 మంది ఆత్మహత్య చేసుకొంటున్నారు. ప్రపంచంలో ఈ రేటు ప్రతి లక్ష మంది మహిళలకు 5.4 శాతమే కావడం గమనించవలసిన విషయం. ఇందుకు కారణం భారత దేశంలో స్త్రీని పూజిస్తున్నట్టు చెప్పుకొంటూనే ఆమెను అమితంగా అణచివేయడమేనని నిపుణులు, పరిశీలకులు నిగ్గు తేల్చారు. ఆడ శిశువును కనడం ఆత్మహత్యా సదృశమనే అభిప్రాయం తొలగిపోవాలి. పెళ్ళి చేయడమంటే అత్తమామలు, భర్త పెట్టే నరకయాతనకు కుమార్తెలను చేజేతులా అప్పగించడమే అనే పరిస్థితి అంతమవ్వాలి. ప్రేమించడం అపరాధమనే కాలం చెల్లిన ఖాప్ పంచాయతీల తీర్పులకు తెర పడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News