Thursday, November 14, 2024

అవసరమైతే డీప్‌ఫేక్ పై కొత్త చట్టం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టే దిశగా కేంద్రం చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగం గానే సోషల్ మీడియా సంస్థలతో కేంద్రం త్వరలో సమావేశం జరపనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేథ(ఎఐ), డీప్‌ఫేక్ వంటి సాంకేతికతతో సృష్టించే నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

అవసరమైతే ఇందుకోసం కొత్త చట్టం తీసుకొస్తామని ఓ జాతీయ మీడియా సంస్థకు వెల్లడించారు. “సాధికారత, వృద్ధి, సృజనాత్మకతకు ఏఐ బలమైన సాధనమే అయినప్పటికీ, కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. టెక్నాలజీ సాయంతో వీరు నకిలీ, విద్వేషపూరిత సమాచారాన్ని వ్యాప్తి చేసి, సమాజంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ సమాచారం ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయి.

ఇలాంటి వాటిని అరికట్టేందుకు ఇప్పటికే మేం ఐటీ నిబంధనలు తీసుకొచ్చాం” అని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇటీవల కొందరు సినీతారల డీప్‌ఫేక్ వీడియోలు కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోడీ కూడా గతవారం స్పందిస్తూ, డీప్ ఫేక్ వీడియోలు ఆందోళనకరమన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు. ఈ నేపథ్యంలోనే చర్యలకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. గురు, శుక్రవారాల్లో సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులతో భేటీ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News