Monday, January 20, 2025

అప్పులకు కేంద్రం అనుమతి?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రుణాల సేకరణకు తెలంగాణ రాష్ట్రానికి అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రతిపాదిత అప్పులో కోత విధించి రుణ సేకరణకు అనుమతిని ఇస్తారని ఆర్థిక శాఖలోని కొందరు సీనియర్ అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో సుధీర్ఘంగా చర్చలు జరిపిన ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దౌత్యం ఫలించిందని ఆ సీనియర్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాదుకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు చేరుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ అధికారుల నుంచి సానుకూలమైన ఫలితాలను రాబట్టిన రామకృష్ణారావు.. మరోవైపు ఆర్‌బిఐ దక్షిణ ప్రాంతీయ శాఖ అధికారులతో కూడా వరుస సంప్రదింపులు జరుపుతున్నారని, ఆర్‌బిఐ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను కూడా ఆమోదించే అవకాశాలు ఉన్నాయని ఆ అధికారులు ఆశాభావం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష వైఖరిపై తీవ్ర నిరసనలు చేపట్టాలనే వ్యూహానికి తాము తాత్కాలిక బ్రేకులు వేసినట్లేనని ఆ అధికారులు వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఎఫ్‌ఆర్‌బిఎం రుణాల విషయంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేందుకు నిర్వహించాలనుకున్న ఒక రోజు అసెంబ్లీ సమావేశం ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందన చూసిన తరువాత తదుపరి కార్యాచరణను రూపొందిస్తామని ఆర్థిక శాఖ అధికారులు వివరించారు.

Centre to Allow Telangana to borrows

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News